02-10-2025 01:50:05 AM
సర్కార్‌కు ప్రైవేట్ డెడ్‌లైన్!
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 12 వరకు రూ.1200 కోట్లు విడుదల చేయాలి.. లేదంటే మరుసటి రోజు 13 నుంచి ఇంజినీరింగ్‌తో సహా ప్రొఫెషనల్ కోర్సులు అందించే కాలేజీల యాజమాన్యాలు సమ్మె బాట పడుతాయని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫతి) చైర్మన్ ఎన్ రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ కే రవికుమార్ తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇద్దరు రాష్ట్ర మంత్రులు గతంలో తమతో జరిపిన చర్చల్లో భాగంగా ఈ దసరా వరకు రూ. 600 కోట్లు, మరో రూ.600 కోట్లు దీపావళి వరకు పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదని పేర్కొన్నారు. రూ.600 కోట్లలో ఈరోజు (బుధవారం) రూ.200 కోట్ల వరకు విడుదల చేశారని, అయితే తమకు మొత్తం రూ.10 వేల కోట్లు ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో రూ.4,500 కోట్లు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, రూ.5,500 కోట్లు ఈ ప్రభుత్వ హయాంలోవని వారు పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వానికి విద్యపై లాస్ట్ ప్రియారిటీ ఉందని, అందుకే విద్యార్థుల సమస్య అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దసరాకు 6 వందల కోట్లు ఇస్తామన్నారని, రాష్ర్టంలో విద్య సంస్థలు నడిచే పరిస్థితి లేదన్నారు. ఇకపై కేవలం సీఎం ఆఫీస్‌తో మాత్రమే చర్చలు చేస్తామని, రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరుతామన్నారు.
12 తర్వాత వివిధ రూపాల్లో ఆందోళనలు
ఈనెల 12 వరకు వెయ్యి కోట్లు విడుదల చేయకుంటే ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానం పలుకుతూ, ఆయన వీలును బట్టి ఈనెల 12 నుంచి 18 వరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంటామన్నారు. ఆ సమావేశానికి సీఎం వచ్చినా రాకున్నా.. ఆ రోజు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
13 నుంచి నిరవధికంగా సమ్మె, ఉద్యమ బాటను చేపడతామన్నారు. ఆందోళనలు, నిరసనలు, తరగతి బహిష్కరణ, రాస్తారోకో, లక్షలాది మంది విద్యార్థులతో రోడ్లపైకి వస్తామని, అవసరమైతే కాలేజీలకు తాళాలు కూడా వేస్తామ న్నారు. చలో సెక్రటేరియేట్ పిలుపునిస్తామన్నారు. ఈసారి విద్యార్థులు కూడా తమ సమ్మెలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు.
రూ. కోటి రావాల్సి ఉంటే రూ. లక్ష ఇచ్చారు
ప్రభుత్వం ఇప్పటివరకు అసలు ఎంత నిధులు విడుదల చేశారో కూడా తెలియని పరిస్థితి ఉందని అన్నారు. మాకు ప్రభుత్వం అప్పు ఇచ్చినట్లుగా భావిస్తున్నట్లుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారుల చుట్టూ తిరగని రోజూ లేదని, తమను ప్రభుత్వం తీవ్రంగా అవమానించిందన్నారు. ఒక్కో కాలేజీకు రూ. కోటి రావాల్సి ఉంటే ప్రస్తుతం రూ. లక్ష మాత్రమే ఇచ్చారని, ప్రభుత్వం చేసిన పాపానికి మా కళాశాలలో పనిచేసిన ఆటెండర్లు, అధ్యాపకులు దసరా పండుగ చేసుకోలేని పరిస్థితి ఉందన్నారు.