calender_icon.png 2 October, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌పై హస్తం దృష్టి

02-10-2025 01:31:01 AM

  1. ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై కసరత్తు 
  2. పీసీసీ అధ్యక్షుడు, ఇన్‌చార్జ్ మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ 
  3.   6వ తేదీకి ముందే ఆశావహుల జాబితా సిద్ధం చేయాలని సూచన  
  4. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం 

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. త్వరలోనే ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో.. అభ్యర్థి ఎంపికపై సర్కార్ కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థిని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించడంతో పాటు స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది..

అధికార పార్టీ మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లను ఈ నియోజక వర్గానికి ఇన్‌చార్జ్‌లుగా నియమించిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ప్రధానంగా మారింది. ఇదే విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌తో సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో జూబ్లీహిల్స్ అభ్యర్థితో పాటు స్థాని క సంస్థల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల అంశంపైనా చర్చించారు. ప్రభుత్వ పథ కాల అమలులో వేగం పెంచాలని. డివిజన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తిం చి వెంటనే పరిష్కరించాలని, పార్టీ కేడర్‌ను కూడా అప్రమత్తం చేయాలని సీఎం సూచించారని తెలిసింది.

స్క్రీనింగ్ కమిటీకి ముందే అభ్యర్థుల జాబితా 

 ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఈ నెల 6న జరగనుంది. దీనికి ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని ఇన్‌చార్జ్ మంత్రులకు సూచించారు.

జూబ్లీహిల్స్‌లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపుతారా..? లేదా ఓసీకి అవకాశం ఇస్తారా..? అనే అంశంపై  స్పష్టత రావాల్సి ఉంది. బీసీ కోటాలో నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ మురళిగౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ రేసులో ఉన్నారు. ఓసీ కోటాలో సీఎస్ రెడ్డి, రంజిత్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. 

దసరా తర్వాత ‘బీసీ గర్జన’

దసరా పండుగ తర్వాత బీసీ గర్జన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది. గత నెలలో కామారెడ్డిలో బీసీ సభను నిర్వహించాలనుకున్నప్పటికీ.. రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా వాయిదా వేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేయడంతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

బీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. అయినప్పటికీ స్థాని క సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేయనున్నది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున భారీ సభ నిర్వహించడానికి సమయం ఉంటుందా..? అనేది కూడా మరో చర్చ జరుగుతోంది.  

అభ్యర్థుల ఎంపికపై సర్వేలు..  

జూబ్లీహిల్స్ నియోజక వర్గాన్ని హస్తగతం చేసుకోవాలని అధికార పార్టీ పట్టుదలతో ఉన్నది.  అందుకు అనుగుణంగా నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా సర్వేలు నిర్వహిస్తోంది. ఒక వైపు ఇంటెలిజెన్స్ వర్గాలు సర్వే నిర్వహిస్తుండగా,  సీఎం రేవంత్‌రెడ్డి  కూడా మరో రెండు సర్వే బృందాలను రంగంలోకి దింపారు. వీరితో పాటు ఏఐసీసీ కూడా రెండు బృందాలతో ఆరా తీస్తోంది.  నియోజక వర్గంలో పార్టీ పరిస్థితితో పాటు ఐదారుగురు అభ్యర్థులపైన ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి  కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బాటుంటుందనేదానిపైనా సర్వే నిర్వహిస్తున్నారు.