30-08-2025 09:29:59 PM
చిన్న చింతకుంట: మండల కేంద్రంలోని సీసీ కుంట పోలీస్ స్టేషన్ లో ఈ రోజు వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి(District SP D. Janaki) సీసీ కుంట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది సేవలపై ఏవైనా సమస్యలు ఉంటే తాము పరిశీలిస్తామని, విధుల విభజన ప్రకారం సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులందరికీ సమానంగా సేవలందించాలని, స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలు కాపాడుతూ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లను నవీకరించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ప్రతి కేసులో నాణ్యత, పారదర్శకతతో విచారణ జరిపి, శిక్షల శాతం పెంచే దిశగా కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లలో 5S అమలు తీరును పరిశీలించి, ఫైళ్ల నిర్వహణ పద్ధతులపై మార్గనిర్దేశం చేశారు.
స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ పట్ల ప్రతి పోలీస్ అధికారి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని, హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు మరియు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వారికి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు విజిబుల్ పోలీసింగ్‌ను మరింతగా పెంచాలని, రాత్రి పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని తెలిపారు. ప్రజల రక్షణే తమ ధ్యేయమని, అందుకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సీసీ కుంట సబ్ ఇన్స్పెక్టర్ రామ్ లాల్, ఏఎస్ఐలు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.