30-08-2025 09:30:51 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్య ఆకాంక్షించారు. శని వారం మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవాలు - 2025 పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలని, అన్ని అంశాలలో నైపుణ్యాలు ప్రదర్శించాలని కోరారు. నైపుణ్యాలను ప్రదర్శించడానికి కళా ఉత్సవ పోటీలు ఒక చక్కటి వేదిక అని, దీనిని ఉపయోగించుకొని విద్యార్థులు రాణించాలన్నారు.
అలరించిన జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీలు...
జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీలు అందరిని అలరించాయి. ఆరు విభాగాలలో ఈ పోటీలు నిర్వహించగా జిల్లాలోని వివిధ యాజమాన్యాలకు చెందిన దాదాపు 350 మంది విద్యార్థులు అద్భుతమైన కళా ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా శాంకరి ఆర్కే ప్రసాద్, రాజన్న, సుమన చైతన్య, భూపతి సంతోష్, జనార్ధన్, మూర్తిలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి, సెక్టోరల్ ఆఫీసర్ చౌదరి, జైపూర్ ఎంఈఓ శ్రీనివాస్, వివిధ పాఠశాలల విద్యార్థులు, గైడ్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.