22-01-2026 01:27:22 AM
వనపర్తి క్రైమ్ జనవరి 21: రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని, అప్పుడే రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించగలమని కామారెడ్డి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ - అలైవ్‘ కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి జిల్లా పరిధిలోని పెద్దమందడి, కొత్తకోట, పెబ్బేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 44వ జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లను ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నాం. ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమన్నారు. ప్రమాద ప్రాంతాల్లో స్పష్టమైన సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చుని సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల భద్రతే లక్ష్యంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ ’అరైవ్ అలైవ్’ లక్ష్యాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణాన్ని సాగించాలని అధికారులు కోరారు.
సమాజంలో భద్రతా సంస్కృతిని పెంపొందించేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పీ, బాలాజీ, వనపర్తి ఆర్టీఓ, సైదులు, కొత్తకోట ఎస్త్స్ర, ఆనంద్, పెద్దమందడి ఎస్త్స్ర, జలంధర్ రెడ్డి, పెబ్బేర్ ఎస్త్స్ర, యుగంధర్ రెడ్డి, అల్లంపూర్ టోల్ ప్లాజ ప్రాజెక్టు అధికారి, ప్రసాద్ రావు, మేనేజర్ బాలచందర్, అడ్డాకల్ టోల్ ప్లాజ మేనేజర్లు, కార్తికేయన్, కిషోర్ రెడ్డి, రఘునందన్ గౌడు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, రోడ్డు రవాణా శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.