22-01-2026 02:57:46 AM
కత్తెర గుర్తుతో బీసీ ఎజెండానే ఆయుధంగా ముందుకు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కత్తెర గుర్తుతో బరిలోకి దిగనుందని పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బలమైన, ప్రజల మధ్య ఉన్న అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ మాటను పూర్తిగా మరిచిపోయిందని, ఆ హామీపై ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు నోరు మెదపకపోవడం ద్వారా బీసీలకు చేసిన మోసంలో భాగస్వాములయ్యా యని మల్లన్న ఆరోపించారు.
ఈ మూడు పార్టీలు కలిసి బీసీలను రాజకీయంగా వాడుకుని వదిలేశాయని, వారి మోసాన్ని ప్రజా క్షేత్రంలో నిలదీసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. టీఆర్పీ ఎన్నికల అజెండా పూర్తిగా బీసీల సమస్యలు, హక్కు లు, రిజర్వేషన్ల చుట్టూనే ఉంటుందని చెప్పా రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మ ల్లన్న విలేఖరుల సమావేశంలో అన్నారు. బీ ఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కూడా బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించకుండా మౌనం గా ఉండిపోయాయని, ఈ మూడు పార్టీల మోసాన్ని ప్రజలకు వివరించి.. మున్సిపల్ ఎన్నికల్లో బీసీల గొంతుకగా టీఆర్పీ నిలబడుతుంది అని తెలిపారు.
కత్తెర గుర్తుతో బయలుదేరిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలను రాజకీయంగా కత్తిరిస్తాం అని చెప్పారు. బీసీల ఎజెండానే మున్సిపల్ ఎన్నికల కేంద్ర బిందువుగా మారేలా పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేశామని స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పో రాటం ఆగదని, మున్సిపల్ ఎన్నికలు బీసీల హక్కుల కోసం జరిగే ఎన్నికలుగా మారతాయని తీన్మార్ మల్లన్న తేల్చి చెప్పారు.