23-07-2025 06:58:19 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. బుధవారం కెరమెరి మండల కేంద్రంలో గల వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి వంటశాల, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యత, సామాగ్రినిలో చేసే గది పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యారంగా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యా అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, వంటలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితులలో నాసిరకం సరుకులు, కాలం చెల్లిన సరుకులను వినియోగించకూడదని, ఒకవేళ వినియోగించినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వసతి గృహాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలని, విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యమైన గుడ్లను వినియోగించాలని, వంట వాడే సరుకులను క్రమ పద్ధతిలో నిల్వ చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు బ్లాంకెట్లు అందించారు.
అనంతరం మండల కేంద్రంలోని హక సేవా కేంద్రాన్ని సందర్శించి యూరియా నిల్వలు, స్టాకు రిజిస్టర్ ను పరిశీలించారు. రైతులకు పంట సాగులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యూరియా, ఇతర పిచికారి మందులు అందుబాటులో ఉంచాలని, ఎట్టి పరిస్థితులలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు యూరియా, ఇతర మందుల వినియోగంపై అవసరమైన సూచనలు అందించాలని, నిషేధిత గడ్డి మందుల వాడకాన్ని నియంత్రించాలని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ (యు) వ్యవసాయ సంచాలకులు వెంకటి, మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారి, హక కేంద్రం నిర్వహకులు, రైతులు పాల్గొన్నారు.