14-10-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల్లో ఎన్నికలు లేక గ్రామపంచాయతీలకు నిధులు రాక పంచాయతీ కార్యదర్శులు అవస్థలు పడుతున్నారు. నిధుల కోసం గ్రామపంచాయతీ కార్యదర్శులు విలవిలలాడుతున్నారు. 20 నెలలుగా గ్రామాలలో ప్రజాప్రతినిధులు లేక ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ కార్యదర్శులు సమస్యలు పరిష్కరించేందుకు డబ్బులు అవసరం కావడంతో ఇప్పటివరకు అప్పులు తెచ్చి ఖర్చు చేసిన పంచాయతీ కార్యదర్శులకు నిధులు రాక అవస్థలు పడుతున్నారు.
గ్రామ పంచాయతీలో సమస్యలు ఒకదాని వెనుక ఒకటి, సమస్యలు తలెత్తుతూ, పంచాయతీ కార్యదర్శులకు అప్పులు గుదిబండగా మారాయి. నిధులు వస్తాయి అనే ఆశతో అప్పులు చేసి ఖర్చు చేసిన గ్రామ కార్యదర్శులకు ప్రభుత్వం నుంచి నిధులు రాక అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పుకోలేక తికమక అవుతున్నారు. గ్రామ కార్యదర్శులకు అప్పులు రోజురోజుకు చుట్టుముడుతూనే ఉన్నాయి.
స్థానిక ఎన్నికలు లేక పంచాయతీ కార్యదర్శులు పాపం వాళ్ళ జీతాల నుండి డబ్బులను కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతూనే ఉన్నది. గత ఏడాది జనవరిలో, సుమారు 20 నెలలు గా, పంచాయతీల పాలక వర్గాల గడువు పూర్తి కాగా అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.
త్వరలో ఎన్నికలు అంటూ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతూనే ఉన్నది. గత రెండు సంత్సరాలుగా పంచాయతీల పాలక వర్గాల గడువు పూర్తి కాగా అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు ఉంటే మాత్రమే వచ్చే ఆర్థిక సంఘం నిధులు, మంజూరు అయ్యేవి కానీ నిధులు లేక స్థానిక సంస్థలు లేకపోవడంతో గ్రామపంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడో నిలిచిపోయాయి.
కనీస అవసరాలు తీరకపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడింది. సొంత డబ్బు ఖర్చు చేయలేక, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్లో వ్యాధులు ఎక్కువగా ప్రబలే పరిస్థితి ఉంది. దీనికి పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకం. వాటికి నిధుల అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది.
గ్రామాలలో ప్రతి కార్యదర్శి, ఒక్కో కార్యదర్శి ఏడాది కాలంగా రూ.1.5 లక్షల నుంచి రూ. 3. లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశారు. అందులో చిల్లిగవ్వ కూడా ఇప్పటివరకు, నిధులు విడుదల కాలేదు. అయినప్పటికీ వారిపై పని ఒత్తిడితో పాటు ఆర్థిక ఒత్తిడి కూడా తీవ్రమవుతోంది. కేవలం మల్టిపుల్ వర్కర్ల వేతనాలు గ్రామ పంచాయతీ అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. మిగతా నిర్వహణ ఖర్చులు మాత్రం మంజూరు కావడం లేదు.
కొత్తగా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలు కొలువుదీరితేనే 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పాలకవర్గాలు ఉన్న సమయంలో నిధులు రావడం ఆలస్యమైనా సర్పంచులు ముందుగా సొంత డబ్బు ఖర్చు చేసి తర్వాత తీసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంకా ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారనే విషయంలో ఎవరికి స్పష్టత లేదు.
కేంద్ర, రాష్ట్రాలది ఓకే తీరు..
పంచాయతీలకు సాధారణంగా మూడు రకాలుగా నిధులు వస్తాయి. పన్ను రూపంలో వసూలైన మొత్తాన్ని జనరల్ ఫండ్ ద్వారా ఖర్చు చేసుకోవడం, ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం నిధులు మంజూరు చేయడం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు రావడం జరుగుతుంది. ఈ నిధులతోనే పంచాయతీల్లో పనులు జరుగుతాయి. అయితే 2023 మార్చి నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు మంజూరు కావడం లేదు.
జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు నిధులను విడుదల చేస్తారు. ఒక్కో వ్యక్తికి సంవత్సరంలో రూ.1680 చొప్పున అందజేయాల్సి ఉంటుంది.. సర్పంచుల పదవీకాలం పూర్తయినప్పటి నుంచి నిధులు పెండింగ్ లో పడిపోయాయి. ప్రతి సంవత్సరం ఇచ్చే నిధులను ఐదు శాతం పెరగాల్సి ఉండగా ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు పెండింగ్ నిధులే రాని పరిస్థితులు ఉన్నాయి.
దీంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయడం, సామాగ్రి కొనుగోలు చేయడం, ట్రాక్టర్ డీజిల్, నిర్వహణ, వీధి దీపాలు, మంచినీటి నిర్వహణలో భాగంగా పైప్ లైన్ల లీకేజీలు, మోటార్ల మరమ్మతులు, కొత్త మోటార్లు తేవడం వీటికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాల ఖర్చు మొత్తం కలిసి తడిసి మోపెడవుతుంది
పర్యవేక్షణ సరే పారిశుధ్య పనుల సంగతేంటి
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణ సమాచారం తెలుసుకునేందుకు తీసుకువచ్చిన డైలీ శానిటేషన్ రిపోర్టు (డీఎస్‌ఆర్) అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు పంచాయతీ కార్యదర్శులు ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు గత వారం రోజుల క్రితం హైదరాబాద్ లో పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులతో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
దీంతో ఇప్పటికే కామారెడ్డి జిల్లాలోని, డి ఎస్ ఆర్, గ్రామ పంచాయతీలలో ఉన్న ప్రత్యేక పాలన అధికారులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ నిధులే లేనప్పుడు ప్రతీ రోజూ పారిశుధ్య పనులు ఎలా చేపట్టాలనే ఆందోళన కార్యదర్శులను వేధిస్తోంది. డీఎస్‌ఆర్ అప్లికేషన్ లో ఫేస్ రికగ్నైజ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రదానం.
దాన్ని డౌన్లోడ్ చేసుకున్న కార్యదర్శులు డీఎస్‌ఆర్ అప్లికేషన్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు విముఖత చూపుతున్నారు. ఇప్పటి వరకు తమ సొంత ఫోన్లలో శానిటేషన్ రిపోర్ట్ అప్లోడ్ చేశారు. డీఎస్‌ఆర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే సమాచారం మొత్తం రాష్ట్ర స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శులపై పనిభారం
హరితహారం, ఉపాధి హామీ, పల్లె ప్రగతి, పన్నుల వసూలు, జనన మరణాల నమోదు, కల్యాణ లక్ష్మి ఇలా అనేక పనులతో పంచాయతీ కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో తాగునీరు, ఇంటి పన్నుల వసూలు డబ్బులతో అత్యవసర పనులు చేసుకుంటుండగా, తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. గతంలో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ఆటోలకు పంచాయతీ నుంచి కిస్తులు చెల్లించడంతో ఖాతాలు ఖాళీ అయ్యాయి.
గ్రామాల్లో కాల్వలు శుభ్రం చేయడం, తాగునీటి పైప్ లైన్ లీకేజీలు సరిచేయడం, ట్రాక్టర్లలో డీజిల్ పోయించడం తదితర అత్యవసర పనుల కోసం కార్యదర్శులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీలకు 15 వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్సినిధులు రాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు లేదని, ఉద్యోగులకు వేతనాలు సైతం నేరుగా వారి అకౌంట్లలోకే వెళ్తున్నాయని, తాము ఏమీ చేయలేమని జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు.
విధులు నిర్వహించలేక పోతున్నాం
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో విధులు నిర్వహించలేకపోతున్నాము. స్వచ్చదనం- పచ్చదనం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలో అక్టోబర్ నెలలో, పక్షం రోజులు, ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతుందని అన్నారు. గ్రామంలో వీధిలైట్లు మురికి కాలువలు పంచాయతీ సిబ్బందికి, త్రాగునీరు బోరు మోటర్లు ఇతర వంటి గత రెండు సంవత్సరాలుగా గ్రామాలలో ప్రజలు జరుపుకున్న పండుగలకు వేడుకలకు మా ఇంటి నుండే నా జీవితంలో నుండే డబ్బులను ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
సిద్ధిరాములు, పంచాయతీ కార్యదర్శి
సొంత డబ్బులతో సమస్యలు తీరుస్తున్నాం
ఎల్లారెడ్డి మండలంలో 31 గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ అధికారులు ప్రజలకు అవస్థలు తలెత్తకుండా తమ సొంత డబ్బులతో కొంతమేరకు సమస్యలను తీర్చగలుగుతున్నామని పంచాయతీ కార్యదర్శులు నెల జీతం లో నుండి కూడా డబ్బులను ఖర్చు చేస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారని, స్థానిక ఎన్నికలు త్వరితగతిన జరిగితే పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్ అధికారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. 31 గ్రామపంచాయతీలో రోజుకు ప్రతి గ్రామపంచాయతీ నుండి త్రాగునీటి సమస్య బోరు మోటర్లు వీధి దీపాలు మురికి కాలువలు, ఏదో ఒక సమస్యతో ప్రజలు అధికారులను పనులుT చేపట్టాలని ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి, ఎంపీడీవో ప్రకాష్
నెలసరి జీతం నుంచి మౌలిక వసతులు కల్పిస్తున్నాం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్లోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట గాంధారి మండలాల్లో 144 గ్రామపంచాయతీలు ఉన్నాయని గ్రామపంచాయతీ లో నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు తమ నెలసరి జీతం నుండి వారి పంచాయితీ పరిధిలోని ప్రతి అవసరానికి మౌలిక వసతులకు వీధి దీపాలు గాని విద్యుత్ బల్బులు గాని పంచాయతీ సిబ్బంది గాని చెత్త ట్రాక్టర్లకు కానీ ఇతర ఇతర పనులకు కార్యదర్శులు తమ సొంత జీతం నుండి డబ్బులు ఖర్చు చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులకు చాలా అవస్థలు ఉన్నాయని స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతే తప్ప ఈ అవస్థలు పోవని తెలిపారు.
గత ప్రభుత్వాల పాలనలో 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్రవ్యాప్తంగా 15 వందల కోట్ల రూపాయలు నిధులు , వస్తుండేవని సుమారు ఎల్లారెడ్డి డివిజన్ కు సుమారు 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యేవని ఆ నిధుల ద్వారా మండలానికి కొన్ని నిధులు ప్రతి గ్రామపంచాయతీకి నిధులు చేరడంతో గ్రామాలలో మౌలిక వసతులు ప్రజల అవస్థలు తీరేవని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు లేక పంచాయతీ అధికారులు కార్యదర్శులు, చాలా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు ఉదయం నుండి సాయంత్రం వరకు సమస్యలతో సతమతమవుతున్నారు.
డీఎల్‌పీఓ సురేందర్, ఎల్లారెడ్డి డివిజన్ పంచాయతీ అధికారి