calender_icon.png 14 October, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షం

14-10-2025 12:46:55 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 13 ( విజయక్రాంతి ): ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన భారీ అకాల వర్షానికి అన్నదాతల ఆశలు అడియాశలయ్యాయి. కళ్ళముందే ధాన్యం రాశులు వరద నీటిలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండడమే తప్ప చేసేది లేక బోరున విలపించారు. మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ మండలాలలో, మార్కెట్ యార్డులలో ఐకెపి సెంటర్లలో ఆరబోసిన లారీలకొద్ది ధాన్యం వర్షార్పణమైంది.

మోత్కూరు మార్కెట్ యార్డ్ కు తరలించిన ధాన్యం వారం రోజులైనా కొనేవారు లేక పోవడంతో ఆరబోసిన ధాన్యం అకాల వర్షానికి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన ధాన్యాన్ని  అధికారులు కొనుగోలు చేసినట్లయితే నష్టపోయే వారం కాదని రైతులు వాపోతున్నారు. వలిగొండ మండలం గోపరాజు పల్లి ఐకెపి సెంటర్లు. మార్కెట్ యార్డులలో తడిసిన ధాన్యం సైతం వరద నీటిలో కొట్టుకుపోయింది. అకాల వర్షం తమను నట్టేట ముంచిందని మహిళా  రైతులు కన్నీరు మున్నేరు అవుతున్నారు.

ఐదు ఎకరాల పొలానికి పెట్టుబడి పెట్టి కోత కోసి మార్కెట్ కి తరలిస్తే వానదేవుడు సృష్టించిన బీభత్సానికి తమ ఆశలు అడియాశలు అయ్యాయని చేసిన అప్పు తీరక ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులే ఇక మా భవిష్యత్తు అంటూ రైతన్నలు  బోరుమంటున్నారు. చౌటుప్పల్ మండలం నక్కలగూడెం లో భారీ  వర్షానికి చేతికి వచ్చిన పంట చేను పూర్తిగా వరద పాలయింది. కోళ్ల ఫారం లోకి వరద నీరు చేరుకోవడంతో 6 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి.

వరద నీటిలో కొట్టుకపోయిన ధాన్యాన్ని రైతులు తీవ్రమైన ఆవేదనతో దుఃఖంతో చీపుర్లతో ఊడుస్తూ చేతులతో ఎత్తుకుంటూ, ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తడిసిన ప్రతి గింజను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండ మండలంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆవేదన చెందొద్దని భరోసా కల్పించారు.