calender_icon.png 19 May, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

19-05-2025 07:52:23 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సోమవారం సుమారు 97 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించగా, అందులో జిల్లా అధికారులకు సంబంధించి (44), రెవెన్యూ అంశాలకు సంబంధించి (53) ఫిర్యాదులు వచ్చాయి.

ముఖ్యంగా ఈ ఫిర్యాదులలో ఎప్పటిలాగే వ్యక్తిగత అంశాలకు సంబంధించినవి ఎక్కువగా ఉండగా, ఉద్యోగం, ఉపాధి, తదితర అంశాలు, భూములకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా  వచ్చాయి. అయితే ఫిర్యాదుదారులు ప్రతి వారం పెరుగుతూ వస్తున్నందున జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఈ అంశంపై శ్రద్ధ తీసుకోవాలని, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ వారంలో వచ్చిన ఫిర్యాదులు అదేవారం పరిష్కరించేందుకు కృషి చేస్తే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందని, ఆ విధంగా కింది స్థాయిలో సైతం అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుకు తెలియజేయాలని, ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కానట్లయితే ఎందుకు కాలేదో స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ కొన్ని ఫిర్యాదులను అక్కడే పరిష్కరించగా, మరికొన్నింటికీ ఎండార్స్మెంట్ ఇస్తూ సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన్యా పథకాల  అమలులో  నిర్లక్ష్యం లేకుండా నిర్దేశించిన సమయంలోగా లబ్ధిదారులకు అందించేలా చూడాలని కోరారు. భవిత కేంద్రాలలో సౌకర్యాలు, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు, వేసవి తీవ్రత ఉన్నందున తాగునీరు, విద్యుత్తు, టిఎస్ఐ పాస్, టి ప్రైడ్ అంశాలపై సమీక్షించారు. భవిత కేంద్రాల ప్రతిపాదనలన్నిటిని వెంటనే సమర్పించాలన్నారు. ఇంచార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, జిల్లా అధికారులు, తదితరులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ఫిర్యాదులను స్వీకరించారు.