19-05-2025 07:56:43 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మైనార్టీ విద్యాసంస్థల్లో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు ప్రవేశానికై అర్హులైన విద్యార్థులు దగ్గర్లోని మైనార్టీ విద్యాసంస్థలలో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) కోరారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మైనారిటీ విద్యాసంస్థలలో విద్యార్థుల ప్రవేశానికి అవగాహనకై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. జిల్లాలో 13 మైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయని, వీటిలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు ఒక్కో తరగతిలో సుమారు 60 వరకు ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
అర్హులైన విద్యార్థులతో ఈ ఖాళీ సీట్లను భర్తీ చేయడం జరుగుతుందశని, ప్రవేశ ప్రక్రియ ఇదివరకే పూర్తయినప్పటికీ, ఖాళీలు ఉన్నందున ముందుగా వచ్చిన వారికి ముందుగా సీట్లు ఇచ్చే పద్దతిని పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ మైనార్టీ విద్యాసంస్థలలో సీటు సాధించిన విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను, ప్రత్యేకించి వసతి, భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జిల్లాలో (6) మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, వాటిలో మూడు బాలురకు, మూడు బాలికలకు ఉన్నాయని, ఆయా తరగతులలో ప్రవేశం కోసం విద్యార్థులు ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్, కండక్ట్ సర్టిఫికెట్, రికార్డ్ షీట్ లేదా టిసిని జత చేయాలని, అలాగే తల్లిదండ్రుల ఆదాయం, కులం ధ్రువపత్రాలు జత చేయాలని చెప్పారు.
జూన్ 12 లోపు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం పొందే విధంగా అవసరమైన వారు దగ్గరలోని మైనార్టీ పాఠశాలను సంప్రదించాలన్నారు. ఇదివరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోనప్పటికి, సీట్లు ఉంటే ఇవ్వడం జరుగుతుందని, అందువల్ల దగ్గర్లో ఉన్న మైనార్టీ పాఠశాలలో లేదా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల రీజినల్ కో-ఆర్డినేటర్ సెల్ల్ నెంబర్ 7331170877 ను సంప్రదించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, ఇన్చార్జి డిఆర్ఓ వై.అశోక్ రెడ్డి, డిఆర్డిఏ శేఖర్ రెడ్డి, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మైనార్టీ విద్యాసంస్థల జిల్లా అధికారి విజయేందర్ రెడ్డి, ఆర్ సి ఓ విష్ణు, తదితరులు పాల్గొన్నారు.