08-01-2026 12:00:00 AM
దొంగతనాలకు పాల్పడుతున్న వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్పీ
నల్గొండ క్రైమ్, జనవరి 7: జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు జిల్లాలో గతంలో దొంగతనాలకు పాల్పడిన వారికీ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రoలో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించి, నేరాలకు దూరంగా ఉండి ,సమాజంలో గౌరవప్రదమైన, చట్టబద్ధమైన జీవితం గడపాలని వారికి సూచించారు. జిల్లాలో నేరాలకు అలవాటుపడిన వ్యక్తుల కదలికలపై పోలీస్ శాఖ ఇప్పటికే ప్రత్యేక నిఘా ఉంచామని, నైట్ పెట్రోలింగ్ టీములు, సీసీటీవీ నిఘా వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
తరచూ నేరాలకు పాల్పడుతున్న నిందితులు తమ ప్రవర్తనను వెంటనే మార్చుకోకపోతే, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్) రౌడీషీట్లు, బైండోవర్ కేసులు కఠిన చట్టాల కింద అరెస్టులు, రిమాండ్ వంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆస్తి, ప్రాణ భద్రతలకు ముప్పుగా మారే నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.ప్రజలు తమ ఇళ్ల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పొరుగువారితో సమన్వయం ఉండా లని సూచించారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే డయల్ 100, సమీప పోలీస్ స్టేషన్కు వెంటనే సమాచారం అందించాలని కోరారు. నేరాలను మానుకొని ఉపాధి మార్గాల వైపు అడుగులు వేయాలని, అలాంటి వారికి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.