calender_icon.png 23 September, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుపాయలలో ఆధ్యాత్మిక శోభ

23-09-2025 01:01:32 AM

  1. వనదుర్గమ్మ సన్నిధిలో అట్టహాసంగా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం
  2. వనదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రోహిత్
  3. తొలి రోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిచ్చిన వన దుర్గమ్మ 
  4. 29న వనదుర్గా మాతకు ఘనంగా బోనాలు 
  5. అక్టోబర్ 1న సుహాసిని పూజ, చండీ హోమం 

విజయక్రాంతి, పాపన్నపేట:జనమేజయుని సర్ప యాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధిలో సోమవారం దేవి శ రన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2 విజయదశమి వరకు ఏడుపాయల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఉత్సవాల్లో మొదటి రోజు వన దుర్గమ్మ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మేళ తాళాల మధ్య సుందరంగా అలంకరించిన పల్లకిలో వనదుర్గా మాత ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి అందంగా ముస్తాబు చేసిన గోకుల్ షెడ్ లో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఆలయ పరిసరాలు హోరెత్తాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు.

అనంతరం గంగమ్మకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిరోజైన సోమవారం పాడ్యమిని పురస్కరించుకొని వనదుర్గామాత బాలాత్రిపుర సుందరిదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ నాయకులు, ఆలయ సిబ్బంది, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రోజు వారీగా అమ్మవారి రూపం..

తొమ్మిది రోజుల పాటు పూజలందుకునే అమ్మవారు చివరి రోజు అక్టోబర్ 2న విజయదశమిని పురస్కరించుకొని రాజరాజేశ్వరి దేవిగా (పసుపు) వనదుర్గమ్మ దర్శనం ఇస్తారని వారు తెలిపారు. ప్రతిరోజు ప్రాతఃకాల సమయాన అమ్మవారికి అభిషేకం, ఉదయం విఘ్నేశ్వర పూజ తదితరాలు నిర్వహిస్తామని తెలిపారు.

29న వనదుర్గామాతకు అంగరంగ వైభవంగా బోనాలు, అక్టోబర్ 1న సుహాసిని పూజ, చండీ హోమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనదుర్గా అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.