31-01-2026 08:15:08 PM
హాజరైన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శనివారం భక్తుల సందడితో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కతో కలిసి ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయ కమిటీ కార్యనిర్వహణ అధికారి వేణుగోపాల్ గుప్త, ఆలయ కమిటీ చైర్మన్ లెండిగూరె జైరాం సంప్రదాయబద్ధంగా వారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక పూజల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గంగాపూర్‌లో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవం ప్రశంసనీయమని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సద్భావనలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.