calender_icon.png 26 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

62 వేల కోట్లతో తేజస్ ఫైటర్‌జెట్లు

26-09-2025 01:25:44 AM

  1. 97 యుద్ధవిమానాల కోసం హెచ్‌ఏఎల్‌తో రక్షణశాఖ ఒప్పందం
  2. ప్రాజెక్ట్‌తో వచ్చే ఆరేండ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాలు
  3. 2027 నుంచి ప్రారంభం కానున్న ఫైటర్‌జెట్ల సేకరణ 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: రూ.62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి హిందుస్థాన్ ఏరోనా టిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)తో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది.  వాయుసేనలో కీలక సేవలందించిన మిగ్ యుద్ధ విమానాలకు వీడ్కోలు పలకనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 97 తేజస్ యుద్ధవిమానాల కోసం కొన్ని నెలల క్రితమే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పచ్చజెండా ఊపగా,

తాజాగా ఈ ఒప్పందం పూర్తయ్యిం ది. సమీకరిస్తున్న 97 యుద్ధ విమానాల్లో 68 యుద్ధ విమానాలు, 29 ట్విన్ సీటర్స్ ఉంటాయని రక్షణశాఖ వెల్లడించింది. మిగ్ యుద్ధ విమానాల స్థానంలో ఈ సింగిల్ ఇంజిన్ ఎంకే తేజస్ జెట్‌లను ప్రవేశపెడుతున్నారు. ఈ అత్యాధునిక ఫైటర్ జెట్లలో ఉత్తమ్ ఏఈఎస్‌ఏ రాడార్, స్వయం రక్షాకవచ్ వ్యవస్థలతోపాటు కంట్రోల్ యాక్యుయేటర్లు ఉంటాయి.

వీటిలో 64 శాతానికి పైగా దేశీయ కంటెంట్, 67 దేశీయ ఉత్పత్తులు ఉంటాయని రక్షణ శాఖ స్పష్టం చేసింది. 2027 సంవత్సరం నుంచి వీటి సేకరణ ప్రారంభమవుతుందని, తద్వారా వాయుసేన సామర్థ్యాలు పెరగడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్, భారత రక్షణ సంసిద్ధతలను మరింతగా పెంపొందించినట్టు అవుతుందని రక్షణశాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఆరేండ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాల చొప్పున లభిస్తాయని రక్షణ శాఖ తెలిపింది. కాగా రక్షణ శాఖ 2021లోనూ 83 యుద్ధ విమానాల కోసం రూ.48 వేల కోట్లతో హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.