calender_icon.png 4 September, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత

04-09-2025 12:25:16 AM

చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 7న ఆర్జిత సేవలు రద్దు

హైదరాబాద్, సెప్టెంబర్ 3(విజయక్రాంతి): చంద్రగహణం కారణంగా 7న సాయంత్రం 3.30 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయను న్నారు. ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయతీ.

ఈ నెల 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునఃప్రారంభమవుతుంది.

కాగా చంద్రగ్రహణం కారణంగా ఈ నెల7న  ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి తిరుమలలో అన్న ప్రసాదాల వితరణ ఉండదు. మరుసటి రోజు  ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా ఈ నెల 7న టీటీడీ బ్రేక్ దర్శనలు కూడా రద్దు చేసింది.