13-10-2025 01:18:30 AM
-నామకరణంపై 24 గంటల్లో జీవో జారీ చేస్తాం
-నల్లగొండకు గోదావరి నీళ్లు దామన్న కృషి ఫలితమే..
-ఆయన కుటుంబానికి గాంధీ కుటుంబం అండ
-కాంగ్రెస్ జెండా మోసిన జోడెడ్లు వెంకట్‌రెడ్డి, దామోదర్ రెడ్డి సోదరులు
-దామోదర్ రెడ్డి సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సూర్యాపేట/తుంగతుర్తి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): శ్రీరామ్ సాగర్ రెండో దశకు మాజీ మంత్రి రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 24 గంటల్లోగా నామకరణానికి సంబంధించిన జీవో జారీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆదివారం జరిగిన దామోదర్‌రెడ్డి సంతాప సభకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఖమ్మం జిల్లాలోని లింగాలలో పుట్టిన దామన్న.. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. 1985 సంవత్సరంలో తుంగతుర్తిలో మొదటిసారి కమ్యూనిస్టు కంచుకోటపై ఎమ్మెల్యేగా పోటీ చేసి, గెలిచి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నాంది పలికారన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేసి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల అభివృద్ధిలో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందులు సామేలుకు రూ.50వేలు లేకున్నా, టికెట్ రావడంతో పాటు ఆయన గెలుపులో కీలకపాత్ర పోషించారన్నారు. ఎస్సారెస్పీ ఫేజ్ 2కు ఆర్డిఆర్ నామకరణం చేయాలని రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ ఉత్తంకుమార్ రెడ్డి, పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి, వీహెచ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రతిపాదన చేస్తూ వినతిపత్రం ముఖ్యమంత్రి ఇవ్వగా ఆయన పేరును ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో సభా ప్రాంగణం కేరింతలతో హోరెత్తింది.
కక్షలు, కార్పన్యాలు హత్యా రాజకీయాలతో అట్టుడికిన తుంగతుర్తి ప్రాం తంలో వాటన్నిటినీ ఎదుర్కొంటూ కాంగ్రెస్ జెండాను నిలబెట్టిన చరిత్ర దామన్నదని పేర్కొన్నారు. నీళ్లు లేక ఎడారిలా మారిపోతున్న తుంగతుర్తి ప్రాంతానికి ఎస్సారెస్పీ నీళ్లు తేవడానికి ఉద్యమాలు సాగించాడని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలం లో ఎస్సారెస్పీ కాలువల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దాన్ని సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో సుజాతనగర్, నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించిన వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీకి జోడెడ్లలా పనిచేస్తూ జెండాలు మోశారన్నారు. ఏఐసీసీ నా యకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు వారి కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్‌డీ ఆర్ కుటుంబానికి గాంధీ కుటుంబం తప్పక అండగా ఉంటుందన్నారు.
ఆర్‌డీఆర్ మృతి పార్టీకి తీరని లోటు
ఆర్‌డీఆర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు మాట్లాడుతూ దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డికి ఏఐసీసీ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మె ల్యేలు ఎల్లప్పుడూ అండదండగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు మందుల సామేలు, ఉత్తమ్ పద్మా వతి, వేముల వీరేశం, కూనంనేని సాంబశివరావు, దయానంద్, కోరం కనకయ్య, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, కార్పొరేషన్ చైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి, బెల్లయ్య నాయక్, పాల్వాయి రజిని, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, వంశీ చందర్ రెడ్డి, సంకేపల్లి సుధీర్ రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి, పోతు భాస్కర్, మహిళ కమిటీ జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్‌రావు పాల్గొన్నారు.
దామోదర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం : డిప్యూటీ సీఎం
తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురావడానికి ఎస్సారెస్పీ కా లువల వద్ద రక్తతర్పణం చేసిన ఘనత దామోదర్ రెడ్డి దేనన్నారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.