13-10-2025 01:15:39 AM
అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ, మురళి
హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): తన శాఖలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జోక్యం మితిమీరుతోందని దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తెలిపారు. ఈ మేరకు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి కొండా సురేఖ పీఆర్‌వో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయానికి వారు నేరుగా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ములుగు జిల్లా మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనుల టెండర్లలో మంత్రి శ్రీనివాస రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్లు ఆయనను కలిసిన మీడియాతో కొండా మురళి పేర్కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.