24-11-2025 12:00:00 AM
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగొని గాలయ్య
సంస్థాన్ నారాయణపూర్, నవంబర్ 23 (విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణపురం మండలకేంద్రంలోని బాలుర వసతి గృహాన్ని సిపిఐ నాయకుల బృందంతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా వసతి గృహంలో మరుగుదొడ్లకు ఏర్పాటు చేసిన తలుపులు విరిగి ఉండడాన్ని గమనించారు. మరుగుదొడ్లు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన రావడం గమనించి హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా గతంలో పాఠశాలలకు వెళ్లేందుకు హాస్టల్ విద్యార్థుల కోసం కలెక్టర్ ఇచ్చిన సైకిళ్ళు నిరుపయోగంగా ఉండి పాడైపోవడంతో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల ద్వారా వినియోగంలోకి తేవాలని చెప్పారు.
హాస్టల్ భవనానికి ఎదురుగా గ్రామం నుండి వస్తున్న మురికి నీళ్లు భారీగా నిల్వ ఉండడంతో భరించలేని దుర్వాసన దోమలతో విద్యార్థులు చుట్టుపక్కల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీంతో విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశం ఉన్నదని వెంటనే మురుగు నీరు వెళ్లేందుకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ దత్తత తీసుకున్న హాస్టల్లో శుభ్రత నిర్వహించడం లేదని మరోసారి జిల్లా కలెక్టర్ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ బృందంలో సిపిఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, జిల్లా సమితి సభ్యులు కలకొండ సంజీవ, మండల కార్యవర్గ సభ్యులు వీరమళ్ళ యాదయ్య, పల్లె మల్లారెడ్డి, పందుల యాదగిరి, ఈద మల్లయ్య,గడ్డం యాదగిరి, ఎర్రోల్ల లింగస్వామి ఉన్నారు.