calender_icon.png 23 August, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కృతిమ కొరత సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

23-08-2025 12:24:08 AM

  1. రైతుల గోస తగులుతుంది
  2. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రైతులలో గందరగోళం రేపుతుంది
  3. మెదక్ ఎంపీ రఘునందన్ రావు 

సిద్దిపేట, ఆగస్టు 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి ఇబ్బందుల గురిచేస్తుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు విమర్శించారు. శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బి.ఆర్.ఎస్ పార్టీలు యూరియా పేరుతో రైతుల లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన యూరియా నిరంతరంగా సరఫరా అవుతుందని రాష్ట్రంలో రైతుల అందించాల్సిన యూరియాను సకాలంలో అందించకపోవడం వల్లనే సమస్య తలెత్తుతుందని తెలిపారు. వారం రోజుల్లో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని రైతులు అధైర్య పడద్దని కోరారు. రాజకీయ నాయకుల మాటలు నమ్మి రైతులు నిరసనలు చేయటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.

రైతులు రాజకీయ నాయకుల తప్పుడు మాటలు నమ్మి సమయం వృధా చేసుకోవద్దని కోరారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో పటాన్ చేరు, మెదక్, నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలలో 56 అంగన్వాడి కేంద్రాల భవనాల నిర్మాణం కోసం రూ.4.5కోట్లు , 28 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణంకు రూ.5.6కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 25శాతం, కేంద్ర ప్రభుత్వం 75శాతం చొప్పున నిధులు విడుదలవుతాయని తెలిపారు.

రాష్ట్రంలో పనుల జాతర కార్యక్రమం నిర్వహించకుండానే అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం ఆ నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని జిల్లాల కలెక్టర్లను కోరారు.

గతంలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల రైతులకు ప్రభుత్వ నిధులు అందజేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ అధినేత పర్యటన కోసం హెలికాప్టర్ను ఏర్పాటు చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి వారి స్వార్థం కోసం నిధులు ఖర్చు చేయడం సిగ్గుచేటు అన్నారు. 

ఎంపీని అడ్డుకున్న కాంగ్రెస్..

నారాయణరావుపేట మండలంలోని శంకర్ రావు పేట గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. నారాయణరావుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ పర్యటనను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు.

రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రైతులకు యూరియా తెప్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఎంపీ నిరసనకారులతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సినంత యూరియా సరఫరా అవుతుందని, నిరసనకారుల ఫోన్ నెంబర్లు ఇవ్వండి యూరియా సరఫరా అప్డేట్ అందిస్తానని సముదాయించి వెళ్లిపోయారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, నాయకులు వంగ రామచంద్ర రెడ్డి, దూది శ్రీకాంత్ రెడ్డి, బాసంగారి వెంకట్, కాసనకోట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.