16-10-2025 04:28:54 PM
ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్
ఆకట్టుకున్న మార్చ్ ఫాస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు
విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి
150 కోట్ల జనాభాలో క్రీడాకారుల ప్రాతినిధ్యం పెరగాలి
మెదక్ ఎంపీ రఘునందన్ రావు
క్రీడల ద్వారా అద్భుత అవకాశాలు
సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య
క్రీడాకారులకు అద్భుతమైన ఆతిథ్యం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలు పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నిరంతరం క్రీడల అభివృద్ధిని కాంక్షించే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆతిథ్యంలో 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడా జ్యోతిని అందించగా ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పరతోష్ పంకజ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు క్రీడాజ్యోతిని వెలిగించి, క్రీడా పతాకాన్ని ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేశారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఆయా జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్, సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి క్రీడలను పటాన్ చెరు వేదికగా నిర్వహించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అభినందించారు. నిరంతరం క్రీడల అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యే లభించడం పటాన్చెరు ప్రజల అదృష్టం అన్నారు.150 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో క్రీడాకారుల ప్రాతినిధ్యం అతి స్వల్పమన్నారు. ఒలంపిక్ క్రీడల్లో భారతదేశ విజయాల సంఖ్య పెరగాలంటే విద్యార్థి దశనుండే చదువుతోపాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2036 ఒలింపిక్స్ క్రీడలను భారతదేశంలో నిర్వహించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ.. రాష్ట్ర జాతీయస్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల కోట ద్వారా ప్రథమ ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. సొంత నిధులు వెచ్చించి రాష్ట్రస్థాయి క్రీడలను పటాన్ చెరు వేదికగా నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఆమె అభినందించారు.
క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో జాతీయ క్రీడలకు సైతం పటాన్చెరు వేదికగా నిలువబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందించడంతోపాటు వారి ప్రతిభను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో మినీ స్టేడియాలు నిర్మించి క్రీడాకారులకు భరోసా అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎస్పీ పరతోష్ పంకజ్ లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ ప్రావిణ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎస్పీ పరతోష్ పంకజ్లు వాలీబాల్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. పటాన్చెరు డిఎస్పి ప్రభాకర్, సీఐ వినాయక్ రెడ్డిలు బందోబస్తు ఏర్పాటు చేశారు.