20-11-2025 12:00:00 AM
కోదాడ, నవంబర్ 19 : నియోజకవర్గంలోని కోదాడ పట్టణం, మండల కేంద్రాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రతి వీధిలో కుక్కలు స్త్వ్రర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో గొర్రెలు, మేకలు, కోళ్లను చంపి తింటున్నాయి.
అంతేకాకుండా చాలామంది కుక్కకాటుకు గురవుతున్నారు. రాత్రివేళల్లో వీధుల్లో తిరుగుతూ అరుస్తుండడంతో నిద్రపట్టని పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. కుక్కల స్త్వ్రర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. పలు గ్రామాల్లో వీధి దీపాలు సైతం సరిగా లేకపోవడంతో కుక్కలు గుంపులు, గుంపులుగా సేద తీరుతున్నారు.
పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారిపై కుక్కలు దాడికి పాల్పడుతుండటంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాంసాన్ని ఎక్కడ పడితే అక్కడ పడి వేస్తుండడంతో కుక్కల సంచారం ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. మాంసానికి అలవాటు పడిన కుక్కలు మహిళలు, చిన్నారులపై దాడులు చేస్తున్నాయి.
అలాగే లేగదూడలపై దాడులు చేసి చంపి తింటున్నాయి. కుక్కల నియంత్రణ లేకపోవడంతో గ్రామాల్లో కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
సుప్రీంకోర్టు కోర్టు హెచ్చరించినా...
కుక్క కాటు మరణాల పై సుప్రీంకోర్టు హెచ్చరించిన అధికారులతో ఎలాంటి చలనం లేదు. వీధి కుక్కలను జనాలు తిరిగే ప్రాంతాల నుండి తరలించాలని, విద్యా సంస్థలు, బస్సు, రైల్వే స్టేషన్ లలో రాకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు జారీచేసిన క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని, వీధి కుక్కల కాటుకు జంతువులు, పిల్లలు బలి అవుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోదాడ పట్టణంతోపాటు మండలాలలో ఎక్కడ చూసిన గ్రామ సింహాలు స్త్వ్రర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా గుంపులుగుంపులుగా తిరుగుతూ రోడ్లపై కనబడిన వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి.
రోజురోజుకు పెరుగుతున్న దాడులు
కోదాడ మున్సిపాలిటీ తో పాటు, రూరల్ మండలం అనంతగిరి మండలలో కుక్కలు మనుషులతో పాటు జంతువులపై కూడా దాడి చేస్తున్నాయి. కుక్కల దాడిలో ఇటీవల గాయపడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొన్ని నెలల క్రితం ఇంటి లోపల వరండాలో ఆడుకుంటున్న మూడు సంవత్సరాల బాలుడు పై కుక్క దాడి చేసికరిచింది. ఈ సంఘటన సోమవారం కోదాడ పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్ లో చోటు చేసుకుంది. ఖమ్మం క్రాస్ రోడ్ లో 18 వ వార్డులో నివాసముంటున్న కొండపల్లి రవి కుమారుడు కొండపల్లి వర్షిత్ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు.
అకస్మాత్తుగా గేటు కింద నుండి వచ్చిన కుక్క బాలుడు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అనంతగిరి మండల పరిధిలోని త్రిపురారం గ్రామంలో బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు రాయబారపు క్రిష్, రాయబారపు తనుశ్రీ లపై కుక్కలు దాడి చేశాయి. వీరికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రి తరలించారు. కుక్క కాటుకు మందులు లేక నల్లగొండ ఏరియా చికిత్స పొందుతున్న చిన్నారులు. ఇంత జరుగుతున్న అటు మున్సిపల్ అధికారులు కానీ గ్రామపంచాయతీ సిబ్బంది గానీ. పట్టించుకున్న దాఖలాలు లేవు.
జంతువులపై కూడా..
మండల వ్యాప్తంగా కుక్కల దాడిలో పలువురి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల కోదాడ రూరల్ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామానికి చెందిన దాసరి లింగస్వామి సాకుతున్న గొర్రెలపై కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేయడంతో 10 గొర్రెలు మృతి చెందాయి.
అనంతగిరి మండలంలోని వసంతాపురం ఆవాస గ్రామమైన తెల్లబండ తండాలో కుక్కలు దాడిలో రైతు వాంకుడోత్ మలుసూరు సాకుతున్న గొర్రె కుక్క దాడిలో మృతి చెందింది. కోదాడ రూరల్ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన పిట్టల పుల్లయ్య కు చెందిన ఆరు మేకల పై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందాయిఈ విధంగా కుక్కల దాడిలో గొర్రెలు, లేగ దూడలు మృత్యువాత చెందటంతో పాడిపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా నష్ట పోతున్నారు.
పట్టింపు లేని నిబంధనలు...
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం పెంపుడు కుక్కను పెంచుకోవాలన్నా స్థానిక గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పెంచుకునే కుక్కలకు యజమాని క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయించాల్సి ఉంటుంది. దీంతో అవి అనుకోకుండా ఎవరినైనా కరిచి గాయప ర్చినా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు.
ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ, అటు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ భయపెట్టిస్తున్నాయి. గ్రామ సింహాలు కరవడంతో పశువులు కూడా మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.