31-12-2025 01:18:23 AM
డ్రంక్ అండ్ డ్రైవ్‌కు నో
బహిరంగ మద్యం సేవనంపై నిషేధం
ప్రజల భద్రతే లక్ష్యం
ఇల్లందు సీఐ సురేష్ హెచ్చరిక
ఇల్లందు, డిసెంబర్ 30 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఇల్లందు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి. సురేష్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ప్రజల ప్రాణ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.యువకులు ద్విచక్ర వాహనాలపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, అధిక శబ్దాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం నేరమని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనల్లో పాల్గొన్న వాహనాలను తక్షణమే స్వాధీనం చేసుకొని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పూర్తిగా నిషేధమని, గొలుసుకట్టు దుకాణాల్లో మద్యం విక్రయించినా లేదా సేవించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇల్లందు పట్టణం నలుమూలల విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించను న్నట్లు వెల్లడించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుశిక్ష తప్పదని, అటువంటి వారు తమ పండుగ ఆనందాన్ని పోలీస్ స్టేషన్లోనే గడపాల్సి వస్తుందని సీఐ హెచ్చ రించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ప్రజలకు ఇబ్బంది కలిగించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవిస్తూ, కుటుంబ సభ్యులతో శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఇల్లందు సీఐ టి. సురేష్ కోరారు.