27-12-2025 02:46:23 AM
రాత్రి ఒంటి గంటకే పబ్బులు బంద్
పాత నేరస్తులపైనా నిఘా
సర్వీస్ అపార్ట్‌మెంట్లు,ఫామ్ హౌస్‌లపై దాడులు
నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి):నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ మహానగరంపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. ఈసారి జీరో డ్రగ్స్ విధానమే లక్ష్యంగా న్యూ ఇయర్ వేడుకలు జరగాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
బంజారాహిల్స్‌లోని కమాం డ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన పబ్బు లు, హోటళ్ల నిర్వాహకులకు, నగర వాసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గీత దాటితే తాళమే.. లైసెన్స్ రద్దు
వేడుకల సమయపాలనపై సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు కచ్చితంగా రాత్రి ఒంటి గంటకే మూసివేయాలని స్పష్టం చేశారు. సమయం దాటినా, డ్రగ్స్ వినియోగం జరిగినా ఉపేక్షించేది లేదు. నిబంధనలు ఉల్లంఘించే పబ్బులు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వాటి లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు.
అణువణువూ నిఘా..
వేడుకల మాటున మత్తు దందా సాగకుండా శుక్రవారం నుంచే నగరవ్యాప్తంగా ప్రత్యేక నిఘా బృందాలను మోహరించారు. హెచ్-న్యూ టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేవలం పబ్బులే కాకుండా సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లు, ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌ల్లో జరిగే పార్టీలపైనా నిఘా ఉంచారు.
నిఘా జాబితాలో పాత నేరస్తులు..
గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ నిందితులు, పెడ్లర్లు, వినియోగదారుల కదలికలను పోలీసులు నిశితంగా గమనిస్తున్నా రు. వారి జాబితాను సిద్ధం చేసి ట్రాక్ చేస్తున్నారు. అలాగే నూతన సంవత్సర వేడుకల కోసం నగరానికి కొత్తగా వస్తున్న వారి వివరాలను కూడా ఆరా తీస్తున్నారు.
సామాన్యులకు ఇబ్బంది లేకుండా..
నగరంలోని రద్దీ ప్రాంతాలైన ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, కేబీఆర్ పార్క్, మైత్రీవనం వంటి చోట్ల పటిష్టమైన బ్యారికేడింగ్, చెక్పోస్టులు ఏర్పా టు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. అయితే, నిఘా పేరుతో సామాన్య ప్రజలకు, కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సీపీ సూచించారు. సమా వేశంలో డీసీపీలు ఎన్ శ్వేత, కె అపూర్వరావు, రక్షిత కృష్ణమూర్తి, సీహెచ్ రూపేష్, చింతమనేని శ్రీనివాస్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.