calender_icon.png 13 October, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు

13-10-2025 05:02:15 PM

బాల్య వివాహాలు చేస్తే వధూ వరుల తల్లిదండ్రులతో పాటు వివాహంలో పాల్గొన్న ప్రతి ఒకరిపై కేసు నమోదు..

వనపర్తి జిల్లాలో మాధ్యలోనే చదువు మానేసిన 181 మంది విద్యార్థులను తిరిగి కళాశాలల్లో చేర్పించాలి..

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైన పోషణ మాసం కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన లక్ష్యాలు, చేపట్టిన కార్యక్రమాలపై జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లాలో 498 మంది ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలను ఎన్.ఆర్.సి. సెంటర్ లో వైద్యంతో పాటు పౌష్టికాహారం అందించి వైద్యం చేయించినట్లు తెలిపారు. జనవరి, 1 నుంచి ఇప్పటి వరకు వనపర్తి జిల్లాలో 31 బాల్య వివాహాలు కేసులు నమోదు అయినట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 181 మంది విద్యార్థులు కళాశాల నుండి మధ్యలోనే చదువు మానేసినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో 121 అబ్బాయిలు ఉండగా 60 మంది అమ్మాయిలు ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన జిల్లా కలెక్టర్ చదువు మానేసిన అమ్మాయిలు ఎక్కడున్నారో గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ, సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోను జిల్లాలో బాల్య వివాహాలు నిర్వహించడానికి వీలు లేదని ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే మాత్రం అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులతో పాటు వివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చట్టరీత్య కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అక్టోబర్ 15న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామస్థాయి కమిటీలు సమావేశాలు నిర్వహించి అదే రోజున మండల కమిటీలో ఏర్పాటు చేయాలని డి.పి.ఓ, డి.ఆర్.డి. ఎ అధికారులను ఆదేశించారు.

అక్టోబర్ 17న జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బాల్య వివాహాల కు సంబంధించిన ముందస్తు సమాచారం 1098 లేదా 100 లేదా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. అనంతరం ఆర్.డి.ఎస్. స్వచ్ఛంద సంస్థ చిన్నమ్మ థామస్ వారు రూపొందించిన "ఇచ్చట బాల్య వివాహం నిర్వహించబడవు" అనే గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లలకు అన్న ప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణులకు సీమంతం కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు పాల్గొని అన్న ప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు, గర్భిణులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా సంక్షేమ అధికారిని సుధారాణి పి డి ఆర్ డి ఓ ఉమాదేవి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.