05-11-2025 11:15:23 PM
బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలంలోని ఆవుడం గ్రామంలో 9వ తరగతి చదువుతున్న వర్షిత్ సాయి అనే విద్యార్థి బుధవారం కడుపు నొప్పితో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. మంగళవారం పాఠశాలకు వెళ్లి వచ్చిన వర్షిత్ సాయి గ్రామంలో ఉన్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి వారితో బగారా రైస్, చికెన్ భోజనం చేశాడని, అదే రోజు రాత్రి ఇంటికి వెళ్లి పప్పుతో భోజనం చేసినట్లు తెలిపారు.
బుధవారం ఉదయం కడుపునొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపి వైద్యుని వద్దకు తీసుకువెళ్లారని, కడుపునొప్పి ఎక్కువ కావడంతో స్థానిక వైద్యుని సూచనలు మేరకు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు వర్షిత్ సాయి తండ్రి కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.