calender_icon.png 27 December, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తార్కిక జ్ఞానానికి గణితమే సోపానం

27-12-2025 06:12:57 PM

* టీఎల్‌ఎం ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు : కలెక్టర్ రాజర్షి షా

* గణిత మేళాలో ఆకట్టుకున్న విద్యార్థుల ఇంగ్లీష్ ముచ్చట్లు

ఉట్నూర్,(విజయక్రాంతి): గణితం విద్యార్థుల్లో తార్కిక శక్తిని, ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం ఉట్నూర్ మండలం హస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత బోధనాభ్యసన సామగ్రి (TLM) మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గణిత ఉపాధ్యాయుడు అజయ్, విద్యార్థులు సంయుక్తంగా తయారు చేసిన గణిత నమూనాలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి పఠన సామర్థ్యాన్ని పరీక్షించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కలెక్టర్‌తో ఆంగ్లంలో సంభాషించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీ బాల్యం ఎలా గడిచింది? కలెక్టర్ కావాలనే లక్ష్యం ఎందుకు ఎంచుకున్నారు? విద్యా విధానంలో ఎలాంటి మార్పులు అవసరం? అంటూ విద్యార్థులు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు కలెక్టర్ చిరునవ్వుతో సమాధానాలిచ్చారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని ఆయన మెచ్చుకున్నారు. అనంతరం పాఠశాలలోని కిచెన్ గార్డెన్‌ను పరిశీలించి, ఆవరణలో మొక్కను నాటారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... బోధనాభ్యసన సామగ్రి (TLM) వినియోగం వల్ల క్లిష్టమైన గణిత సూత్రాలు కూడా సులభంగా, ఆసక్తికరంగా అర్థమవుతాయన్నారు. విద్యార్థులు గణితాన్ని భయం లేకుండా ఆచరణాత్మకంగా నేర్చుకోవాలని సూచించారు. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్‌లో ఈ పాఠశాల రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని, ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలకు అవసరమైన తాగునీరు, గ్రంథాలయం, క్రీడా సామాగ్రి, గణిత ల్యాబ్, బెంచీలు వంటి మౌలిక వసతులను త్వరలోనే కల్పిస్తామని అన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.