calender_icon.png 16 September, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంధకారంలో విద్యార్థుల భవిష్యత్

16-09-2025 01:18:19 AM

-ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి పైసా లేదనడం చేతకానితనమే

-రేవంత్‌రెడ్డి పాలనలో హైదరాబాద్‌లో పెరిగిన క్రైం రేటు

-కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్

-ఉప ఎన్నికతోనే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలి

-జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి) : రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత విద్య కు దూరమయ్యే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి పైసా కూడా లేదని డిప్యూటీ సీఎం చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 20వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను చెల్లించామని పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు గత కాంగ్రెస్ ప్రభు త్వం పెండింగ్‌లో ఉంచిన రూ.మూడు వేల కోట్లు కూడా చెల్లించామని తెలిపారు. అయి తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డబ్బులు లేవన్న సాకుతో పెండింగ్ బకాయిలను ఇవ్వడం లేదని విమర్శించారు. 

యూరియాను అమ్ముకుంటుండ్రు

 రాష్ర్టంలో యూరియా సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమని కేటీఆర్ అన్నారు. అధికార పార్టీ నాయకులే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్ మెన్ లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోవడం రాష్ర్టంలో కాంగ్రెస్ నేతల దోపిడీకి నిలువెత్తు నిదర్శనమన్నారు. 

కేసీఆర్ పేరుందని పథకాల నిలిపివేత

మాజీ సీఎంలు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌ఆర్, రోశయ్యలు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను కేసీఆర్ కొనసాగించారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే, కేసీఆర్ పేరు ఉం దన్న కారణంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీర లు, రంజాన్ తోఫాలు అన్నింటినీ ఆపేశారని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకుతింటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

పట్టపగలే దోపిడీలు, అత్యాచారాలు

హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, క్రెం రేట్ విపరీతంగా పెరిగిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై ప్రేమ ఉంటే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు మంత్రులు పోవాలి కాని ఉప ఎన్నికల ప్రచారంలో తిరగొద్దన్నారు. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని తెలంగాణలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, గులాబీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోనే మొదలవ్వాలన్నారు. తెలంగాణ దివాలా తీసింది, ఎయి డ్స్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ అంటూ రేవంత్‌రెడ్డి రాష్ర్టం పరువు తీస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే తమ ఇంటిని కూల్చివేసేందుకు పర్మిషన్ ఇచ్చినట్టే అన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని కార్యకర్తలకు సూచించారు. జీఓ నంబర్ 58, 59 కింద లక్ష మందికి కేసీఆర్ పట్టాలిచ్చారని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేల మంది ఇళ్లను కూలగొట్టిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుం డా, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లిహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశా రు. జూబ్లీహిల్స్‌లో విజయంతో మాగంటి గోపినాథ్‌కు నివాళులర్పించాలన్నారు.