31-10-2025 11:32:04 PM
చిట్యాల,(విజయక్రాంతి): రామన్నపేట పరిధిలో కొమ్మాయిగూడెం, సిరిపురం రైల్వే అండర్ పాస్ వంతెన వద్ద వర్షం మూలంగా నిలిచిపోయిన నీటిని తొలగించి విద్యార్థులు గ్రామాల ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జిల్లాల పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. సిపిఎం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి స్థానిక రైల్వే స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం సంబంధిత అధికారి పీడబ్ల్యూ కృష్ణకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే అధికారుల ముందు చూపు లేక అండర్పాస్ వే నిర్మాణం చేయగా వర్షాలు పడినప్పుడు నీళ్లు నిలిచిపోయి నిత్యం ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. గత రెండు రోజులుగా వడ్ల లారీ మధ్యలోనే ఆగిపోయి ప్రజలు సమస్య ఎదుర్కొంటున్నారని, స్థానిక మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు బస్సులు రాక తల్లిదండ్రులు ప్రతినిత్యం చుట్టూ తిరిగి వారి వెంటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని మూలంగా విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని,రైతులు పండించిన పంట కనీస మార్కెట్ కు చేర్చలేకపోతున్నారని, నిత్యం మండల కేంద్రానికి చౌటుప్పల్ కు వెళ్లే ప్రయాణికులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అనేకసార్లు విన్నవించిన రైల్వే అధికారులు పట్టించుకోవడంలేదని,
తమ రైళ్లకు 10 నిమిషాలు అంతరాయం కలిగిన వెంటనే స్పందించే రైల్వే అధికారులు గత పది రోజులుగా ప్రయాణికులు ప్రజలు ఇబ్బంది పడుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే నీటిని తొలగించి ప్రజల ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా చూడాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ధర్నాకు స్పందించిన రైల్వే అధికారులు సమస్యను వెంటనే పరిష్కారం చేస్తామని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వగా అనంతరం ధర్నా విరమించారు.