01-11-2025 12:00:00 AM
-సామినేని రామారావును గొంతు కోసి హతమార్చిన దుండుగులు
-సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్
-ఖమ్మం జిల్లా పాతర్లపాడులో ఘటన
-దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, అక్టోబరు 31 (విజయ క్రాంతి): ఖమ్మం జిల్లాలో సీపీఎం నేత సామినేని రామరావు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఉదయం నడకకు వెళ్లి వస్తున్న ఆయన్ని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన రామారావు ప్రతిరోజు లాగే శుక్రవారం ఉదయం నడకకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఇంటి సమీపానికి చేరుకోగానే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి చంపే శారు.
మరో మూడు రోజుల్లో ఆయన మనవరాలు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే రామారావు హత్యకు గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. సీపీఎం నేత హత్యతో పాతర్లపాడు గ్రామంలో కలకలం రేగింది. విష యం తెలుసుకున్న ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హంతకులు ఎవ రు? హత్యకు కారణం కుటుంబ గొడవలా? లేక మరేదైనా కారణమా? అనే కోణాలను జల్లెడ పడుతూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతర్లపాడు గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీపీ ఎం నాయకులు మాత్రం ఇది కచ్చితంగా రాజకీయ హత్య అని, కొన్ని నెలల కిందట మరొక గ్రామంలో జరిగిన తమ పార్టీ నేత హత్యలో నిందితులే ఈ హత్యకు కూడా పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అండతోనే దుండగులు ఈ దుశ్చర్యకి పాల్పడ్డారని, అధికార పార్టీ నాయకులు ప్రకటన లకు పరిమితం కాకుండా నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా సీపీఎం నేత సామినేని రామారావు హత్యకు గురవడం పట్ల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రామారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషయంపై ఖమ్మం పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి, శాంతిభద్రతలకు ఎలాంటి విఘా తం కలగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయా లని పోలీసులను భట్టి విక్రమార్క ఆదేశించారు.