calender_icon.png 30 August, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలి

30-08-2025 12:51:45 AM

ఎంపీ ఈటెల రాజేందర్ 

మేడ్చల్, ఆగస్టు 29(విజయ క్రాంతి): విద్యార్థులు క్రీడల్లో పాల్గొని ఆరోగ్యవంతులుగా ఉండాలని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం దుండిగల్ లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అథ్లెటిక్ ట్రాక్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ కోర్టులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశం హాకీ కి పుట్టినిల్లు అని, హాకిని ధ్యాన్ చంద్ విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. ఆయన పుట్టినరోజును భారత ప్రభుత్వం జాతీయ క్రీడల దినోత్సవం గా ప్రకటించిందన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, ప్రతి ఎంపీ క్రీడాకారులను కలుసుకోవాలని తమకు ఆదేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. యువత విలువలు, సంప్రదాయాలతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడినట్టు వార్తలు వస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే కళాశాల ప్రాంగణంలో కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆటలు కూడా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మర్రి లక్ష్మణ్ రెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఓపెన్ జిమ్‌ల ప్రారంభం 

మేడిపల్లి ఆగస్టు 29 : బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో మహితా ఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను లక్ష్మి నగర్ పార్క్, ద్వారకా నగర్ పార్క్,శివ దుర్గా పార్క్, చిన్న క్రాంతి కాలనీ పార్క్ లలో శుక్రవారం ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలో మరిన్ని పార్కులు, జిమ్లు, ఆరోగ్య వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ,బోడుప్పల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, మునిసిపల్  సిబ్బంది పాల్గొన్నారు.