01-08-2025 01:07:36 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జూలై 31 (విజయక్రాంతి) : విద్యార్థులు ప్రతి సబ్జెక్టు ఇష్టంతో చదివి మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట మండలం టేకుమట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి పలు అంశాలపై ఆరా తీశారు..
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను, వ్యక్తులు చేసే వృత్తి ద్వారా సమాజంలో గుర్తింపు పొందుతారన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తును రూపొందించడానికి పాఠశాల స్థాయి నుండే కష్టపడాలన్నారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ భాషలపై పట్టు సాధించాలన్నారు. బోధనా పద్ధతులు, భాషా నైపుణ్యాలను పొందడంలో విద్యార్థుల పురోగతి సాధించాలని, విద్యార్థులు క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ, నెమ్మదిగా నేర్చుకునేవారికి అర్ధం అయ్యేలా భోదించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని సూచించారు.
ప్రాథమిక జ్ఞానాన్ని బలోపేతం చేయడానికి, వారి అభ్యాస ఫలితాలను పెంచడానికి అదనపు తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈయన వెంట డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, డిఆర్‌డిఎపిడివివి అప్పారావు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపిడిఓ బాలకృష్ణ, ప్రధాన ఉపాధ్యాయులు పాపయ్య, ఉపాధ్యాయులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.