రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు సుగూర్ విద్యార్థిని ఎంపిక
పెబ్బేరు, జూలై 2: మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సుగూర్కు చెందిన 8వ తరగతి విద్యార్థిని జి. శారద రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గరల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్కు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో జూలై 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గరల్స్ ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనే వనపర్తి జిల్లా జట్టుకు శారద ఎంపికైనట్లు పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఆర్. వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఎంపికలు జూలై 1న పెబ్బేరు పీజేపీ క్యాంప్ ఫుట్బాల్ మైదానంలో నిర్వహించిన ఎంపికల ద్వారా జరిగినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎండి. షబ్బీర్ వెల్లడించారు. విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.






