19-11-2025 12:00:00 AM
-స్లాట్ ద్వారా పత్తి కేవలం 7క్వింటాలు కొనుగోలు నిబంధన ఎత్తివేయాలి.
-పత్తి దిగుమతి సుంకం ఎత్తివేయాలి
-పత్తి రైతులకు బాసటగా పోరుబాట
-మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, నవంబర్ 18 ( విజయక్రాంతి ): పత్తి పంటకు మద్దతుధర 8110రూపాయలు చెల్లించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుల తరుపున ప్రభుత్వం కు డిమాండ్ చేశారు. బి.ఆర్.ఎస్ రాష్ట పార్టీ పిలుపు మేరకు పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెలటూర్ ఎస్.ఎస్.వి కాటన్ మిల్లు దగ్గర పత్తి రైతులు, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులతో కలసి ఆయన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్లు ఎక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలలో పత్తి సాగు చేశారని అకస్మాత్తుగా సి.సి.ఐ కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు కొనుగోలు నిలిపివేయడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారని దుయ్యబట్టారు. బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలకు చెరొక 8మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ప్రయోజనం లేకపోయిందని రైతులు మద్దతు ధరలేక,యూరియా దొరకక,బోనస్ లేక,రుణ మాఫీ కాక,కరెంట్ కోతలతో హరిగోస పడుతుంటే పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో 12 క్వింటాలు కొనుగోలు చేస్తుంటే కాపస్ యాప్ ద్వారా తెలంగాణలో 7క్వింటాలు కొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సి.సి.ఐ కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల మధ్య సమన్వయం చేసి పత్తి కొనుగోలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కె.సి.ఆర్ హయాములో మద్దతు ధరతో రైతులు మహారాజులాగా బ్రతికితే కాంగ్రెస్ పార్టీ హయాములో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
వెంటనే జిల్లా వ్యాప్తంగా పత్తి నీ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమములో జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మాజీ జెడ్. పి.టి.సి రఘుపతి రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మండల పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.