దీదీ ప్రభుత్వానికి ‘సుప్రీం’లో ఊరట

30-04-2024 12:05:00 AM

టీచర్ నియామకాలు రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పుపై స్టే

ఢిల్లీ, ఏప్రిల్ 29: ఉపాధ్యాయుల నియామకాల కేసులో పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లో ఊరట లభించింది. 26 వేల టీచర్ల నియామకాన్ని రద్దుచేసి, సీబీఐ విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో ఎన్నికల వేళ మమతా బెనర్జీ సర్కారుకు తాత్కాలిక ఉపశమనం కలిగిం ది. 2016లో జరిగిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అప్పుడు జరిగిన మొత్తం 25,753 నియామకాలను రద్దు చే యాలని, టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ లో రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని సీబీఐకి ఉత్తర్వులు జారీ చేసింది. కలకత్తా హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఒక్కసారిగా సిబ్బందిని తొలగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రత్యామ్నాయాన్ని హైకోర్టు సూచించలేదని వాదించింది.