01-09-2025 06:50:45 PM
వనపర్తి టౌన్: కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సమ సమాజ ఆశయ సాధనకు పోరాటం సాగించాలని సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, విజయ్ పట్టణ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు లో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు పానుగల్ వనపర్తి గోపాల్పేట మండలాల నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో సుధాకర్ రెడ్డికి జోహార్లు అర్పించి మాట్లాడారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా కంచుపాడులో జన్మించి ప్రజా పోరాటాలు ఊపిరిగా జాతీయ రాజకీయాలకు ఎదిగిన మచ్చలేని నాయకుడు అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కడవరకు నమ్మి, పేదల పక్షాన పోరాటం సాగించారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జాతీయ పార్టీ నేతలను ఒప్పించారన్నారు. దేశ సిపిఐ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఉన్నంతవరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. తెలంగాణలో ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా దేనికైనా ఆయన పేరు పెడతామని సీఎం ప్రకటించటం సముచిత గౌరవం కాగలదన్నారు. దేశంలో కమ్యూనిస్టుల ఐక్యత అవసరమని తద్వారా ప్రజా పోరాటాలు బలోపేతమై ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి అని ఆశించారన్నారు.
ప్రతి కార్యకర్త సుధాకర్ రెడ్డి ఆశయ సాధనకు పనిచేయటమే నిజమైన నివాళి కాగలదన్నారు. మాజీ సర్పంచ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జె. చంద్రయ్య, ఎన్ ఎఫ్ ఐ ఎం జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, పట్టణ కన్వీనర్ జయమ్మ, పానగల్ మండల కార్యదర్శి కురుమయ్య, కమ్మావుల పెంటయ్య, కాటం చిన్న నారాయణ, కాకం కాశన్న, పెద్ద హనుమంతు, చిన్న రాముడు, చెన్నమ్మ, శిరీష ,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.