calender_icon.png 16 August, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లీకొడుకుల సరోగసీ దందా

16-08-2025 12:30:35 AM

అండ దాతలు, అద్దె తల్లులకు ఇంట్లోనే ఆశ్రయం

నిందితులతో సహా ఆరుగురు గర్భిణుల అరెస్ట్

హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులతో ఒప్పందాలు

మేడ్చల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): మాతృత్వం మాటున జరుగుతున్న మరో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ, తన కొడుకుతో కలిసి ఏకంగా తన ఇంట్లోనే అండదాతలు, అద్దె తల్లులకు ఆశ్రయం కల్పించి అక్రమంగా సాగి స్తున్న వ్యాపారం బట్టబయలైంది. పక్కా సమాచారం మేరకు పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆ మహిళ ఇంట్లో తనిఖీ చేయగా విస్తూపోయే అం శాలు బయటపడ్డాయి.

మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. ఏపీలోని చిలకలూరిపేట సమీపంలోని ఒక గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి(45) గతంలో అండదాత, అద్దె తల్లిగా పనిచేసింది. ఆ అనుభవంతో ఇతర ఏజెంట్లు, సంతాన సాఫల్య కేంద్రాలతో ఉన్న పరిచయంతో ఒప్పందం చేసుకుని దందా మొదలుపెట్టింది. జేఎన్‌టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆమె కుమారు డు నరేందర్ రెడ్డి ఈ అక్రమ వ్యాపారం లో తల్లికి సహకరించాడు.

కుత్బుల్లాపూర్ లోని చింతల్‌లో తల్లి, కొడుకు ఉంటున్నారు. ఆ ఇంట్లో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేసి ఆరుగురు గర్భిణులను గుర్తించారు. ఈ విషయమై లక్ష్మీరెడ్డిని ప్రశ్నించగా, వీరందరూ అండదాత, అద్దె తల్లులుగా తేలింది. పేదలు, డబ్బు అవసరం ఉన్న వారిని లక్ష్మీరెడ్డి గుర్తించి, సంతాన సాఫల్య కేంద్రాలకు తీసుకువచ్చేది. అలాగే, డబ్బుకు ఆశపడ్డ ఆరుగురు మహిళలు దీనికి అంగీకరించారు.

వారిలో గోల్కొండ సాయిలీల, మాలగళ్ళ వెంకటలక్ష్మి, పీ సునీత, సత్యవతి, అపర్ణ, జే రమణమ్మ ఉన్నారు. వీరికి లక్ష్మీరెడ్డి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించింది. ఇందుకు అదనంగా సంతాన సాఫల్య కేంద్రాల వద్ద డబ్బులు వసూలు చేసింది. అక్రమాలన్నీ బయటపడటంతో ఈ ఎనిమిది మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. లక్ష్మీరెడ్డి ఇంట్లో రూ.6.47 లక్షల నగదు, ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్లు, హార్మోన్ ఇంజక్షన్లు, హెగ్డే ఆసుపత్రి నుంచి సాయిలీల కేసు షీట్లు, ఐదు స్మార్ట్‌ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

లక్ష్మీరెడ్డి ఒప్పంద చేసుకున్న మాదాపూర్‌లోని హెగ్డే సంతాన సాఫల్యం ఆసుపత్రి, సోమాజిగూడలోని అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, బంజారాహిల్స్‌లోని ఫెర్టీ కేర్, ఈవీఏ ఐవీఎఫ్, అమూల్య ఐవీఎఫ్ సెంటర్, కొండాపూర్‌లోని శ్రీ సంతానోత్పత్తి కేంద్రాల పాత్రపై విచారణ చేస్తున్నామని డీసీపీ కోటిరెడ్డి వివరించారు. ఈ అక్రమ దందాలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ఇది ఒక పెద్ద నెట్‌వర్క్ అని తెలుస్తున్నది. ఇందులో కొన్ని ఆసుపత్రుల హస్తం కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తే పెద్ద రాకెట్ బయటపడే అవకాశం ఉంది.