30-08-2025 09:13:03 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): పచ్చదనం-పరిశుభ్రత ఆధారంగా పాఠశాలకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఎస్ హెచ్ వీ ఆర్ (Swachh Evam Harit Vidyalaya Rating) కార్యక్రమంపై నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలలో పరిశుభ్రత, పచ్చదనం, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో మీరిచ్చే రేటింగ్ తెలియజేస్తుందన్నారు.
ఎస్హెచ్వీఆర్ రేటింగ్ ద్వారా పాఠశాలలు కేవలం శుభ్రతలోనే కాదు, పర్యావరణ పరిరక్షణ, నీటి వినియోగం, శానిటేషన్, విద్యార్థుల ఆరోగ్య భద్రత అంశాలలోనూ ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు. ప్రతి పాఠశాల తప్పనిసరిగా సెప్టెంబర్ 15లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని కోరారు. 2021లో స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపికైన పాఠశాలు కూడా జిల్లాలో ఉన్నాయని, అదే స్ఫూర్తితో 2025లో జరుగుతున్న ఈ రేటింగ్స్ లో కూడా మన జిల్లాలోని పాఠశాలలు రాష్ట్రస్థాయిలోను, జాతీయస్థాయిలోనూ అవార్డులు పొందేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్స్ చౌదరి, సత్యనారాయణమూర్తి, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజగోపాల్, రి సోర్స్ పర్సన్స్ దత్త కుమార్, హరి ప్రసాద్ లు పాల్గొని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు SHVR రిజిస్ట్రేషన్ విధానం, మొబైల్ యాప్/వెబ్ పోర్టల్ ద్వారా వివరాలు ఎంట్రీ చేయడం, 60 సూచికల ఆధారంగా స్వీయ అంచనా ప్రక్రియ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.