06-08-2024 05:11:07 AM
రాజేంద్రనగర్, ఆగస్టు 5: మూసీ నదిని కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వివిధ శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూసీ నది కబ్జా కోరల్లో చిక్కుకుంటోంది. ఎక్కడపడితే అక్కడ కార్పొరేట్ బిల్డర్లు మూసీ నది పరీవాహక ప్రాంతంలో కబ్జాలు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నా అడిగే నాథుడు లేకుండా పోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గండిపేట మండల పరిధిలో మూసీ నది కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. మూసీ నది ప్రధాన రహదారికి కొద్ది దూరంలోనే ఉండడంతో బడా బిల్డర్లు నిర్మాణాలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రివర్ వ్యూ అంటూ ప్రకటనలు గుప్పిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ స్థలాలకు ఆనుకొని ఉన్న మూసీ నదిని క్రమంగా కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ నిబంధనల ప్రకారం మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల మేర ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకునే అధికారం ఉంది. కానీ మూసీనది పరా ధీనం అవుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూముల ధరలు కోట్లలో..
గండిపేట మండల పరిధిలోని నార్సింగి ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. గజం కనీసం రూ.లక్ష పలుకుతోంది. ఈ నేపథ్యంలో బడా కార్పొరేట్ బిల్డర్లు మూసీనది పరివాహక ప్రాంతంలోని తమ స్థలాలకు ఆనుకొని ఉన్న నది పరివాహక ప్రాంతాన్ని మెల్లమెల్లగా కబ్జా చేస్తూ వెనువెంటనే నిర్మాణాలు చేపడుతున్నారు. పరివాహక ప్రాంతాన్ని మట్టిదిబ్బలు, పెద్దపెద్ద బండరాళ్లతో నింపేస్తున్నారు.
దర్జాగా కబ్జా..
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మూసీ నది పరీవాహక ప్రాంతంలోని వివిధ చోట్ల భారీగా కబ్జాలు జరిగాయి. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు గాని, అటు రెవె న్యూ అధికారులు ఏమాత్రం దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అక్రమార్కులు, కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. నార్సింగి ఫ్లుఓవర్ బ్రిడ్జి సమీపంలో మూసీనది పక్కన చాలాకాలంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. అదేవిధంగా నార్సింగి నుంచి అప్పా జంక్షన్ వెళ్లే సర్వీస్ రహదారి పక్కన మూసీనదికి ఆనుకొని ఓ బడా బిల్డర్ నిర్మాణాలు చేపట్టాడు. దీంతోపాటు నార్సింగి జంక్షన్ రోటరీ దగ్గర కూడా బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టారు. ఇలా చాలాచోట్ల ఏమాత్రం నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టారు.
హైడ్రా యాక్షన్ తీసుకునేనా?
కొన్నిరోజుల క్రితం రేవంత్‌రెడ్డి సర్కారు మూసీనది అభివృద్ధితో పాటు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని హైడ్రా ఏర్పా టు చేసింది. దీని ముఖ్య ఉద్దేశం మూసీ నది అభివృద్ధితో పాటు వివిధ అంశాలు ఉన్నాయి. హైడ్రా అధికారులు మూసీ పరివాహకంలోని కబ్జాలపై దృష్టిసారించి అక్ర మార్కుల ఆటలు కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆక్రమణల విషయం హైడ్రా చూసుకుంటుంది
మూసీ నది పరీవాహకంలో కబ్జాలు జరిగినా, అదే విధంగా బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టినా హైడ్రా చర్యలు తీసు కుంటుంది. ఈ విషయంలో మా బాధ్యత లేదు. ఎక్కడైనా కబ్జాలు ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకురావాలి.
రమ, ఇరిగేషన్ డీఈఈ