17-09-2025 06:46:25 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ బుధవారం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో ‘స్వస్థ నారి – స్వశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మెగా మెడికల్ హెల్త్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయంగా ప్రభుత్వ విప్ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళల ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడం, సమగ్ర వైద్య సేవలను అందించడాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ఈ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు అందిస్తారు.
వైద్య శిబిరాల్లో పొందిన సేవల వివరాలను ఆన్లైన్‌లో సమయానుసారంగా నమోదు చేయాలని సూచించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా కార్డులు జారీ చేస్తారు. ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యువజన కార్డులు అందజేస్తారు అని అన్నారు. ఈ శిబిరంలో 371 మందికి పరీక్షలు నిర్వహించి, మందులు అందజేయడం జరిగింది.