12-05-2025 02:11:32 AM
నాగర్ కర్నూల్, మే 11: నాగర్ కర్నూల్ జిల్లా ఎండబెట్ల వద్ద రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం అక్రమ నాటుసారా రవాణాను అడ్డుకుంది. హైదరాబాద్ నుండి నాగర్ కర్నూల్ వైపు వస్తున్న మారుతి ఓమ్ని వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో భారీ పరిమాణంలో నాటుసారా తయారీకి ఉపయోగించే పదార్థాలను గుర్తించారు. ఎస్‌ఐ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలో 432 కిలోల నల్లబెల్లం, 10 కిలోల పటిక, 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వాహనాన్ని నడుపుతున్న గుబ్బ శివకుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తనిఖీలో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ సభ్యులు హనీఫ్, సాయికిరణ్, కౌశిక్, నితిన్, శంకర్లు ఉన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను నాగర్ కర్నూల్ ఆబ్కారీ స్టేషన్కు అప్పగించామని ఆబ్కారీ సీఐ కళ్యాణ్ తెలిపారు.