టాటూ వేయిస్తున్నారా?

29-04-2024 12:10:00 AM

పచ్చబొట్టు మనకు కొత్తగా వచ్చిందేం కాదు. చిన్నప్పుడు అమ్మమ్మ గడ్డం మీదో, నుదుటి మీదో చిన్న పచ్చబొట్లు ఉండేవి. తాత ముంజేతి మీద కూడా దేవుడి బొమ్మనో, లేదా వాళ్ల నాన్న పేరో పచ్చబొట్టు ఉండేది. ఆకు పచ్చరంగులో స్పెషల్ గా కనిపించే ఆ పచ్చబొట్టే ఇప్పుడు రంగులద్దుకొని టాటూగా మారి మళ్లీ వచ్చింది. ఓ పదేళ్ల కిందటిదాకా ఎక్కడో ఒకరికి కనిపించే టాటూ ఇప్పుడు చాలా మామూలైపోయింది. చేతులూ, కాళ్లూ, వేళ్లూ అని ఏం లేదు ఎక్కడ కావలిస్తే అక్కడ పచ్చబొట్టు పడిపోతోంది. నచ్చిన హీరో, నచ్చిన మనిషి, ఆటిట్యూడ్ సింబల్ ఇలా బొమ్మలనుంచీ నచ్చిన మాటని, కోట్స్‌ని కూడా రాసుకుంటున్నారు. ఇప్పుడు మనిషి శరీరం ఒక కాన్వాస్ మాత్రమే కాదు ఒక సైన్ బోర్డ్‌గా కూడా మారిపోయింది. 

టాటూ ఇప్పుడు ఒక క్రేజీ ట్రెండ్‌గా మారింది. ఇష్టమైన వారి మీదున్న ప్రేమను చూపించేందుకు, ఆటిట్యూడ్ కోసం, అందం కోసం, ఫాషన్ కోసం ఇలా కారణం ఏదైనా కావచ్చు టాటూ ఇప్పటి జనరేషన్‌లో క్రేజ్‌నీ, బ్యూటీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వ్యాపారాన్నీ తెచ్చి పెడుతోంది. ఈ క్రేజ్‌ని  క్యాష్ చేసుకుంనేందుకు టాటూ సెంటర్లు పుట్టుకొస్తు న్నాయి. టెక్నాలజీని జోడించి శరీరంపై మెరుపులు మెరిపించేందుకు లేజర్ టెక్నాలజీని కూడా వాడి మరీ శరీరం పై రంగులద్దుతున్నారు టాటూ ఆర్టిస్టులు.  అయితే టాటూ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. టాటూ వేసుకున్న ప్రాంతంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి లేదంటే అందం మాట అటుంచి కొత్త సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది.  

ఎక్కువ మంది చేతులపై, భుజాలపై టాటూలను వేయించుకుంటున్నారు. న్యూయార్క్‌లోని బింగ్ హామ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు టాటూల వల్ల చర్మానికీ, శారీరక ఆరోగ్యానికీ ఉండే సమస్యలని తెలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించారు. దానికోసం అమెరికాలో చలామణిలో ఉన్న తొమ్మిది టాటూ ఇంక్ బ్రాండ్లను అనాలసిస్ చేశారు. ఆ ఇంకులలో మనకు హాని కలిగించే 45 రకాల రసాయనాలు ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నట్టు తేలింది. ఈ అధ్యయనాలు  చెబుతున్న ప్రకారం టాటూ ఇంకులో పాలిథిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాగే మరొక రసాయనం ఇందులో ఉంది. దాని పేరు 2 -ఫినాక్సిథెనాల్ కొన్ని టాటూ ఇంకులలో ఈ ప్రమాదకరమైన పదార్థాన్ని గుర్తించారు. ఈ రసాయనం అధిక మోతాదులో చర్మంలోనికి ఇంకితే చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మూత్రపిండాలు, నరాలకు కూడా హాని కలుగుతుంది.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత్‌లో 60 లక్షల నుంచి 1 కోటి 20 లక్షల మంది ప్రజలు హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ వ్యాధులతో బాధపడుతున్నా. టాటూలు వేయడానికి వాడే సూదిని ప్రతిసారి కొత్తది ఉపయోగించాలి.. వాటిని వేసేవారు కూడా చేతులను శుభ్రంగా ఉంచుకున్నారా లేదా గమనించాలి.  

టాటూ ఉంటే ఈ ఉద్యోగాలలోకి తీసుకోరు

అన్నిటికన్నా ముఖ్యంగా యువత గమనించాల్సిన విషయం ఏమిటంటే. టాటూలు వేయించుకోవటం వల్ల ప్రభుత్వ రంగాలలో కొన్ని ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణించబడతారు. ముఖ్యంగా పోలీస్, ఆర్మీ ఉద్యోగాలకి ప్రయత్నిస్తున్నవాళ్లు పొరపాటునకూడా టాటూల జోలికి వెళ్లకూడడు. మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాల కోసం పచ్చబొట్టు ఉంటే ఉద్యోగం మీద ఆశలు వదులుకోవాల్సిందే.  

ఈ జాగ్రత్తలు అవసరం  

పచ్చబొట్టు వేయాలని నిర్ణయించు కున్నట్లయితే, దానికి ఒక వారం ముందునుంచే శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. రోజూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగడం వల్ల మన చర్మం నునుపుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

ముందుగా గమనించాల్సిన విషయం టాటూ ఆర్టిస్ట్ కొత్త సూదిని ఉపయోగిస్తున్నారా, లేదా తెలుసుకోవటం. మీముందే కొత్త సూదిని సీల్ కవర్‌లోంచి తీశారాలేదా గమనించాలి. ఇంతకు ముందు వాడిన సూదిని ఉపయోగిస్తే అది తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం ఉంది. 

టాటూ వేయించుకోవడానికి ముందు రోజు రాత్రి కాఫీ లేదా ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది. అవి రక్తాన్ని పలుచన చేయడం వల్ల పచ్చబొట్టు పొడిచే సమయంలో అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.

టాటూ వేయించిన కొన్ని గంటలవరకూ నేరుగా టాటూని చేతితో తాకకూడదు. అలాగే కొత్తగా వేసిన టాటూను గోరువెచ్చని నీటితో కడిగి, మెత్తని టవల్‌తో తేలికగా అద్దాలి, గరుకు టవల్ వాడకూడదు, గట్టిగ రుద్దకూడదు. 

ఎక్కువ హార్డ్‌గా ఉండే సబ్బుని వాడకూడదు. బేబీసోప్ నురగతో మాత్రమే శుభ్రం చేయాలి. చీమురావటం, వాపు వస్తున్నట్టుగా అనిపించినా డాక్టర్‌ని కలవాలి. 

టాటూపై కనీసం రెండు వారాల పాటు లోషన్, క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీని రాయాలి. ఇది చర్మానికి రక్షణను పెంచడానికి సహాయపడుతుంది.

కనీసం 3 వారాల పాటు పూల్స్‌లో, మురికిగా ఉండే చెరువుల్లో ఈత కొట్టడం, హాట్ వాటర్ టబ్‌లలో స్నానం చేయడం, సూర్యరశ్మికి దూరంగా ఉండటం మంచిది. 

అన్నిటికన్నా ముఖ్యంగా టటూ వేయించు కోవటం అవసరమా కాదా అని ఆలోచించాలి. ఒకసారి వేస్తే మళ్లీ దాన్ని తొలగించటం, మార్చటం చాలా ఖర్చు, రిస్క్ తో కూడుకున్న పని.    

పచ్చబొట్లు అనేక వ్యాధులకు కారణమవుతాయి. దీని వల్ల హెచ్‌ఐవీ, చర్మవ్యాధులు, హెపటైటిస్ బీ అండ్ సీ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మరో విషయం ఏమిటంటే మానసిక విశ్లేషణ ప్రకారం శరీరంపై టాటూలు వేసుకునే వ్యక్తి  క్రమశిక్షణతో ఉండడని నమ్ముతారు. కాబట్టే టాటూలు వేసుకున్న వ్యక్తులకు కొన్ని ఉద్యోగాలలో ప్రవేశం ఉండదు. ఇక పోలీస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్‌గార్డ్ లాంటి రంగాలలో కచ్చితంగా అనుమతించరు.

టాటూల వల్ల భద్రతకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే, అవతలి వర్గం వాళ్లకి పట్టుబడితే  పచ్చబొట్లు సులభంగా గుర్తించబడతాయి. అతను ఏ ప్రాంతానికి చెందినవాడో సులభంగా చెప్పేయవచ్చు. అందుకే భద్రతా దళాలలో చేరాలనే కల ఉంటే మాత్రం టాటూలకు దూరంగా 

ఉండాల్సిందే.   

మళ్లీ రీచార్జ్ అవుతాను

స్పార్టకస్ పేరు మీరు వినే ఉంటారు. నన్ను చాలా ఇన్స్‌పైర్ చేసిన వీరుడు ఆయన. అతని గురించి తెలుసుకున్నాక ఆయనకి అభిమానిగా మారాను. ఇలా టాటూగా ఆ పేరు వేసుకున్నాను. ఎప్పుడైనా నిరుత్సాహంగా అనిపిస్తే ఈ టాటూ చూసుకుంటాను. మళ్లీ రీచార్జ్ అయిన ఫీలింగ్ వస్తుంది. విహారి 

(స్క్రిప్ట్ రైటర్, మోడల్) 

ఆటిట్యూడ్ తెలిసి పోవాలి

టాటూ వేసుకోవటం అంటే జస్ట్ ఏదో ఒక డిజైన్ కనిపించేలా చేయటం కాదు కదా. నా ఆలోచనా ధోరణి ఎలా ఉందో, నా ఆటిట్యూడ్ ఎలా ఉందో అవతలి వాళ్లకి తెలిసి పోవాలి. అది క్రియేటివ్‌గా కూడా ఉండాలి. అందుకే టాటూ వేసుకోవటానికి ముందే నేను చాలా రోజులు ప్రత్యేకమైన సింబల్స్ కోసం వెతికాను. ఇప్పుడు నా చేతుల మీద నాలుగు టాటూలు ఉన్నాయి. దేనికదే స్పెషల్ మీనింగ్ ఉండేలాగా వాటిని ఎంచుకున్నాను.  

 కామేష్ , సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 

ఇవి తెలుసుకోవాలి 

టాటూ కోసం మనం ఎంచుకున్న ఆర్టిస్ట్ లేదా స్టుడియో నమ్మకమైన చోటేనా? అన్నది చూసుకోవాలి. నీడిల్స్ కొత్తది మారుస్తున్నారా, వాళ్లు వాడే ఇంక్ మంచిదేనా ? ఇలాంటి అనుమానాలను నిర్మొహమాటంగా అడిగి తెలుసుకోవచ్చు. లేదంటే హెచ్‌ఐవీ , హెపటైటిస్ లాంటి ప్రాణాంతక వ్యాధుల దగ్గరనుంచి స్కిన్ ఇన్ ఫెక్షన్స్ దాకా చాలా రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 

అంతే కాదు టాటూ వేస్తున్న చోట అప్పటికే ఏదైనా చర్మ సమస్యలు ఉంటే అవి చర్మం లోపలి పొరల్లోకి వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే టాటూ వేయించుకునే ముందే ఆ ప్రదేశంలో ఏ ఇతర గాయాలూ, ఇన్‌ఫెక్షన్స్ లేవని నిర్ధారణ చేసుకోవాలి. 

కొందరికి టాటూ ఇంక్స్‌తో అలెర్జీలు వచ్చే అవకాశమూ ఉంటుంది. కాబట్టి  ఈ విషయంలో కూడా టెస్ట్ చేసుకున్నాకనే టాటూ వేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. అటోపిక్ టెండెన్సీ ఉన్నవాళ్లకి... అంటే  డస్ట్ ఎలర్జీ, ఆస్తమా లాంటివి ఉన్నవాళ్లకి ఈ ఇంక్ ఎలర్జీ ఉండే అవకాశాలు ఉంటాయి. అందరికీ కాకపోవచ్చు, కానీ అటోపిక్ టెండెన్సీ ఉన్నవాళ్లకి ఇంక్ ఎలర్జీ కూడా ఉండే అవకాశం ఉంటుంది.   టాటూ ఆర్టిస్ట్ కి చర్మ సంబంధమైన వ్యాధుల పట్లా, డెర్మటాలజీ పట్లా అవగాహణ ఉండాలి. వాళ్లకి ఏ ఇంక్ ఎలా వాడాలి, ఏ ఇంక్ క్వాలిటీ ఎలా ఉంటుందీ అని తెలిసి ఉంటుంది. డ్రై స్కిన్, డాన్డ్రఫ్, స్కిన్ ఎలర్జీస్ ఉన్నవాళ్లకి అసలు టాటూ రికమండెడ్ కాదు. ఈ విషయాలన్నీ తెలిసి ఉన్నవాళ్లదగ్గరికి వెళ్లటమే అన్నిరకాలుగా మంచిది. 

  డా. స్వప్న ప్రియ ఎండీ. డీవీఎల్  

సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, 

ట్రికాలజిస్ట్, కేర్ హాస్పిటల్, హైటెక్ సిటీ