calender_icon.png 26 July, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీఆర్ పాలసీ, బిల్డ్ నౌ అద్భుతం

25-07-2025 02:42:55 AM

  1. జీహెచ్‌ఎంసీ విధానాలను ప్రశంసించిన జైపూర్ అధికారులు
  2. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేస్తున్న టీడీఆర్, బిల్డ్ నౌ విధానాలను జైపూర్ అభివృద్ధి సంస్థ కమిషనర్, అధికారు లు ప్రశంసించారు. గురువారం జైపూర్ అభివృద్ధి సంస్థ కమిషనర్ ఆనంది నేతృత్వంలోని ప్రణాళిక డైరెక్టర్ ప్రీతిగుప్తా, ఐటీ సలహాదారు ఆర్‌కె శర్మా, అసిస్టెంట్ టౌన్ ప్లానర్ రుషికేష్ కొల్టే, ఐటీ డిప్యూటీ డైరెక్టర్ పంకజ్ శర్మలతో కూడిన ప్రతినిధి బృందం ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) పాలసీ, బిల్డ్ నౌ అనే ఏకీకృత భవన లేఅవుట్ అనుమతి వ్యవస్థల అధ్యయనం  కోసం జీహెచ్‌ఎంసీని సందర్శించారు.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్‌వి కర్ణన్ టీడీఆర్ పాలసీ, ‘బిల్డ్ నౌ’ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృంద సభ్యులకు వివరించారు. ఈ విధానాల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు భూ సేకరణ సులభతరం చేయడం తో పాటు పౌర సేవలలో పారదర్శకత, సమర్థత, బాధ్యతను పెంచడం జరిగిందని కమిష నర్ బృందానికి తెలిపారు.

ఈ విధానాలను ప్రశంసించిన బృంద సభ్యులు.. జైపూర్ నగర పరిపాలనను బలోపేతం చేసేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు ఇలాంటి వ్యవస్థలను అక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అదనపు జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్‌రావు, అదనపు సిసిపిలు గంగాధర్, ప్రదీప్ కుమార్, ప్రతినిధుల అధ్యయన టూర్ సమన్వయ కర్తలు రాజ్‌కుమార్, విల్సన్ పాల్గొన్నారు.

హైడ్రాకు పూర్తి సహకారం: కమిషనర్ కర్ణన్

వానాకాలం పూర్తయ్యే వరకు విపత్తు నిర్వహణకు హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తా మని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ అన్నారు. గురువారం జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారుల సమన్వయ సమావేశంలో కమిషనర్ ఆర్‌వి కర్ణన్ స్పష్టీకరించారు. హైడ్రా జిహెచ్‌ఎంసీలో అంతర్భాగమేనని వేరుచేసి చూడవద్దు అని అధికారులకు సూచించారు.

క్షేత్ర స్థాయిలో జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, హైడ్రా టీమ్‌గా పని చేయాలని సూచించారు. వర్షాకాల సీజన్‌లో నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు. అన్ని ఆర్‌ఓబీలు, అండర్ పాస్‌ల నిర్వహణ, హైడ్రా గుర్తిం చిన 11 అండర్ పాసులు ఫ్లై ఓవర్ నీటి నిలువ నివారణ బాధ్యతా, ఫ్లోటింగ్ మెటీరియల్ తరలింపు చర్యలకు జీహెచ్‌ఎంసీ సహకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.