08-09-2025 02:00:12 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 30 వేల ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీఎం సమగ్రమైన లేఖను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను గణనీయంగా పెంచడానికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అత్యంత ఆవశ్యకమన్నారు.
ఉపాధ్యాయుల కొరతతో దాదాపు 12 వేల పాఠశాలల్లో ఆంగ్లం, గణితం, సైన్స్ వంటి కీలక సబ్జెక్టులను బోధించేవారు లేకపోవడంతో విద్యార్థులు ప్రాథమిక విషయ పరిజ్ఞానం లేక చదువులలో వెనుకబడిపోతున్నారన్నారు. ఇది జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వాటిల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడలేకపోవడానికి దారితీస్తోందని ఆయన వివరించారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 12 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఇటీవల జూన్‌లో 6 వేల మంది రిటైర్ అవ్వడం, గత ఆగస్టులో 4500 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం, గత డీఎస్సీలో ఎంపికైన వారిలో దాదాపు 2 వేల మంది విధులలో చేరకపోవడం వంటి కారణాలతో ఈ ఖాళీలు భారీగా పెరిగాయని ఆయన వివరించారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో కూడా నాన్-జాయినింగ్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల గణనీయమైన ఖాళీలు మిగిలిపోయాయని ఆర్. కృష్ణయ్య తన లేఖలో ప్రస్తావించారు. ఎయిడెడ్ పాఠశాలల్లో గత 20 సంవత్సరాలుగా నోటిఫికేషన్ జారీ కాకపోవడం, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల్లో పార్ట్-టైమ్ ఉపాధ్యాయులతో నెట్టుకొస్తున్న పరిస్థితులను ఆయన వివరించారు.
మొత్తం మీద రిటైర్‌మెంట్లు, పదోన్నతులు, ఇతర కారణాలతో దాదాపు 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్. కృష్ణయ్య అంచనా వేశారు. వెంటనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.