calender_icon.png 10 September, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్లకు టెట్ ఉండాల్సిందే!

06-09-2025 12:00:00 AM

నాణ్యమైన విద్య అనేది ఉపాధ్యాయుని సమర్థతపై ఆధార పడి ఉంటుంది. ఇతర వృత్తులతో పోలిస్తే ఉపాధ్యాయ వృత్తి విభిన్నమైనది. మంచి నైపుణ్యాలున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకున్నప్పుడే ఈ అవకాశాలను అందిపుచ్చుకోగలరు.

ముఖ్యంగా తరగతి బోధన, కృత్యాల నిర్వహణ, పిల్లల మనస్తత్వం, పాఠశాల నిర్వహణ, ప్రణాళిక, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై అవగాహన ఉండాలి. ఇవన్నీ బీఎడ్, డిఎడ్ వంటి ఉపాధ్యాయ వృత్తి కోర్సుల్లో నేర్పిస్తారు. ఈ కోర్సులను అందించడానికి దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు వెలిశాయి. ప్రతియేటా లక్షలాది మంది అభ్యర్థులు.. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందుతున్నప్పటికీ..

వారు తమ ప్రతిభను చూపించే అవకాశం మాత్రం దక్కడం లేదు. అంతేకాదు మెజారిటీ అభ్యర్థుల్లో సృజనాత్మక, ఆలోచనా త్మక నైపుణ్యాలు కొరవడుతున్నయని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఉపాధ్యాయ విద్యలో సంస్థాగత లోపాలే. నైపుణ్యం లేని ఉపాధ్యాయుల నియామకం వలన పాఠశాల విద్యలో నాణ్యత లోపిస్తుంది. కావున నా ణ్యమైన విద్యను అందించడానికి బోధన ప్రమాణాలను మెరుగుపరచాలని 2009 విద్యాహక్కు చట్టం -సిఫారసు చేసింది.

ఈ చట్టం సిఫార్సు మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ( ఎన్సీటీఈ) మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్రాలకు పంపించింది. ఇందులో భాగంగానే ఒకటి నుంచి 8వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేశారు. ప్రస్తుతం 2011 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. గతంలో ఒకసారి టెట్ పాస్ అయితే కాలవ్యవధి ఏడు సంవత్సరాలుగా ఉండేది. ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి జీవిత కాలం అర్హతగా మార్చేశారు.

పదోన్నతికి కూడా టెట్

ఇటీవల 2010 నుంచి ఉపాధ్యాయ వృత్తిలో నియామకమైన వారందరూ ఉ ద్యోగంలో కొనసాగేందుకు, పదోన్నతి పొందేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2010 కంటే ముందున్న ఉపాధ్యాయులు అదే క్యాడర్ లో ఉండాలనుకుంటే మాత్రం టెట్ ఉత్తీర్ణత అవసరం లేదు.

పదవీ విరమణకు ముందు ఐదేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉన్న టీచర్లు సర్వీసులో కొనసాగాలంటే మాత్రం తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత కావాలని ఆదేశించింది. టెట్ అర్హత సాధించలేక పోయిన ఉపాధ్యాయులు పదవి విరమణ ప్రయోజనాలతో రాజీనామా చేయాలని లేదా రిటైర్‌మెంట్ తీసుకోవాలని తెలిపింది. అయితే పదవీ విరమణకు ముందు ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న వారు మాత్రం టెట్ లేకుండానే సర్వీసులో కొనసాగడానికి ధర్మాసనం అనుమతిని ఇచ్చింది.

వాస్తవంగా 2010లో ఎన్‌సీటీఈ ఒకటి నుంచి 8వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు టెట్ పాసవ్వడం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో టీచర్లుగా నియమితులైనవారు కూడా ఐదేళ్లలోపు టెట్‌లో ఉత్తీర్ణు లు కావాలని సమయం ఇచ్చింది. తర్వాత ఈ గడువును మరో నాలుగేళ్లకు పొడిగించింది. కాగా, ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

2011, జూలై 29 లోపల టీచర్లుగా నియమితులైన అభ్యర్థు లు సర్వీసులో కొనసాగడానికి టెట్ అవసరం లేదని మద్రాసు హైకోర్టు 2025 జూన్‌లో తీర్పు ఇచ్చింది. అయితే పదోన్నతి కోసం టెట్ ఉత్తీర్ణత తప్పనిసరని స్పష్టం చేసింది. కానీ ఇటీవల సుప్రీంకోర్టు.. ఉపాధ్యాయుల పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరి అని స్పష్టం చేయడంతో పాటు టెట్ పదోన్నతులు పొందిన వారు రెండేండ్లలోపు ఉత్తీర్ణత కావాలని తీర్పునిచ్చింది.

ఈ గడువులోపు టెట్ అర్హత సాధించకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ తీర్పు దేశమంత టా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిం ది. పాఠశాలల్లో విద్యార్హతలు గల టీచర్ల ఆవశ్యకతను గుర్తించి విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడానికి టెట్ తప్పనిసరి గా అవసరమని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సామర్థ్యం మెరుగుపడాల్సిందే

భారతదేశంలో అభ్యసన, పేదరికం రే టు కొవిడ్ తర్వాత 70 శాతానికి పెరిగింది. ఇది 2019లో 55 శాతంగా ఉండేద ని ప్రపంచ బ్యాంకు అభ్యసన పేదరిక సూ చిక పేర్కొన్నది. అభ్యసన లోపాన్ని సవరించడానికి ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని మెరుగుపరచాలి. ఈ క్రమంలో ఉపాధ్యా య నియామకంలో టెట్ అనేది కనీస అర్హత పరీక్ష. నైపుణ్యాలను కలిగి ఉన్నారని నిర్ధారిస్తుంది. టెట్‌ను కొన్ని రాష్ట్రాలు ఉపాధ్యాయుల నియామకానికి వాడుతున్నాయి.

మరికొన్ని రాష్ట్రాలు నియామకం లో వెయిటేజీ ఇవ్వగా.. ఇంకొన్ని రాష్ట్రాలు అర్హత పరీక్షగానే పరిగణిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్పీ)లో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012 నుంచి నియామకమైన ఉపాధ్యాయులంతా టెట్ అర్హత గలవారే. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టం లో ఇప్పుడు దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులు కావాల్సి ఉంది.

ఇటీవల దేశవ్యాప్తంగా టీచర్ల సంఖ్య కోటి దాటగా.. టెట్ పాస్ కావాల్సిన వారు లక్షల్లో ఉండవచ్చని అంచనా. వాస్తవంగా 2010 ఎన్సీటీఈ నిబంధనలను విద్యాశాఖ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు చెప్పకపోవడం వల్ల చాలా మంది టెట్ రాయలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ వారి వృత్తికి, ప్రమోషన్‌కు ఇబ్బందిగా మారింది. కావున సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి.

బయాలజీ, తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులకు నిర్వహించే టెట్ పరీక్షల్లో సాంఘికశాస్త్రం, గణితానికి సంబంధించిన ప్రశ్నలను కూడా అడుగుతున్నారు. దీంతో అభ్యర్థులకు అర్హత సాధించడం గగనమవుతోంది. కావున ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు అధిక వెయిటేజీ ఇవ్వాలి. 

ఏటా రెండుసార్లు

టెట్ తప్పనిసరిగా ప్రతి ఏటా రెండు సార్లు జరపాలని ఎన్సీటీఈ పేర్కొన్నది. కానీ చాలా రాష్ట్రాలు నిర్వహించడం లేదు. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు కూడా టెట్ అర్హత తప్పనిసరి. కావున ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తే ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది. నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయ విద్య ను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

ఆధునిక అవసరాలకు అను గుణంగా కరికులంలో చేర్చాలి. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి నిరంతర, వృత్తిపరమైన అభివృద్ధి, నైపు ణ్య ఆధారిత విద్యపై దృష్టి సారించాలి. సమ్మిళిత విద్యకు శిక్షణ, బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య- పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం వం టి అనేక చర్యలు సిఫార్సు చేయబడ్డాయి.

కావున ఉపాధ్యాయుల్లో ఇవన్నీ అలవరిచే విధంగా వృత్తాంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి దూరం చేయా లి. బోధనలో సాంకేతికను జోడించే విధం గా శిక్షణ అందించాలి.

అప్పుడే నాణ్యమైన విద్య అందించగలం. 21 శతాబ్దపు విద్యా అవసరాలు తీర్చడానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం. వీరిపైనే భావి సమాజం ఆధారపడి ఉంటుంది. కావున నిరంతరం ఆధునికతతో ఉపాధ్యాయులు ముందుకెళ్ళినప్పుడే విద్యలో నాణ్యత సాధ్యమ వుతుంది.

 వ్యాసకర్త సెల్: 7989579428