06-09-2025 12:00:00 AM
శిష్యులందరూ గురువులను గుర్తుపెట్టుకోరు. అట్లే గురువులందరూ శిష్యులను గుర్తుపెట్టుకోరు. నా దృష్టిలో గురువులు సాక్షాత్తు దేవతాస్వరూపులు. అమ్మనాన్నల తర్వాత అంతగా గౌరవించేది నేను గురువులనే. నాకు మార్గదర్శకులైన గురువులను నేను గుర్తుపెట్టుకోవడంలో విశేషమేమీ లేదు. కాని నా గురువులే నన్ను జ్ఙాపకం పెట్టుకొని, వాత్యల్యాన్ని చూపినప్పుడు నాకు కల్గిన ఆనందం మాటలలో చెప్పలేనిది.
కొల్కులపల్లిలో 5వ తరగతి వరకు చదివి 6వ తరగతికి నల్లగొండలోని చింతపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చేరాను. అక్కడ చదివిన ఐదేళ్లలో నా మీద ప్రేమ గురిపించి, నా భవిష్యత్తుకు బాట చూపిన వారున్నారు. వారిలో బాలకృష్ణ, శ్యామలయ్య, మధుసూదనరావు, అడపాల నరసింహారెడ్డి అనే నల్గురు ముఖ్యులు. ఈ నల్గురిని ఎల్లవేళల నా జ్ఞాపాకాల్లో ఉంచుకొని వారు నాకేవిధంగా ఆదర్శంగా నిలిచారో నెమరేసుకుంటూ ఉంటాను.
చింతపల్లిలో చదువు ముగించుకొని హైదరాబాదుకు వచ్చి సుమారు నలబై ఏళ్లు దాటింది. ఐనా నన్ను మరిచిపోకుండా ఉన్నవారు అడపాల నరసింహారెడ్డి గారు. ఒక రోజు ఫోన్లో ఆప్యాయతతో కూడిన పిలుపు విన్నాను. ఆ పిలుపు అడపాల వారిదే. నేను తన్మయుడనయ్యాను. ఒకసారి నన్ను చూడాలని వారడగడం నాకెంతో ఆశ్చర్యం కల్గించింది. ‘మీరు రావద్దు, మీ చిరునామా ఇవ్వండి నేనే వస్తాను’ అని ఒక వారం రోజుల తర్వాత వారున్న దుర్గానగర్ కాలనీ (కర్మన్‌ఘాట్)కి వెళ్లాను. ఆదివారం కనుక నాకు మంచి తీరిక లభించింది. చాలాసేపే ఉన్నాను.
నలభై ఏళ్ల తర్వాత అడపాల వారిని చూస్తున్నందుకు ఎంతో సంతోషం కల్గింది. మాటల సందర్భంగా ‘మీకో ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను’ అని 1970 నాటి ‘ఉదయిని’ పత్రికను నా చేతికందించారు. ఆ పత్రికకు నేను అంత చిన్న వయస్సులోనే సంపాదకుణ్ణి. ఇప్పటికీ జ్ఞాపకం ఉన్న విషయం ఏమంటే, ‘ఉదయిని’ వార్షిక సంచికకు నన్ను సంపాదకుణ్ణి చేసింది ‘అడపాల’ వారు ఆ సంచికలో ఒక గ్రూప్ ఫొటో ఉంది. దానిలో అడపాల వారు. కుర్చీలో కూర్చొనగా నేను వారి వెనుక నిలుచున్నాను.
ఆశ్యర్యానికి అంతులేదు
కొన్ని జ్ఞాపకాలు విచిత్రమైనవి ఆ రోజుల్లో తల దువ్వుకోవడానికి దువ్వెన కూడా ఉండేది కాదు. ‘సరిగా తల దువ్వుకొని నిలబడు’ అని చిన్న దువ్వెనను ఇచ్చినవారు అడపాల వారేనని వినయంగా చెప్పుకుంటున్నాను. అడపాల వారు సైన్సు అధ్యాపకులు. ఐనా వారికి తెలుగులో మంచి ప్రవేశం ఉంది. ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ఆధ్వర్యంలో జరిగే తెలుగు పరీక్షలు రాసి కృతార్ధులైన వారు.
వారు ఎవరి ద్వారా ఛందస్సు నేర్చుకున్నారో గాని, నాకు తానొక సైన్సు ఉపాధ్యాయులై ఉండి ఛందస్సు నేర్పారంటే వారెంతో అభినందనీయులని చెప్పక తప్పదు. పోతన పద్యంలాగా వారు గుర్తుండిపోయారు. ఆ కాలంలో అధ్యాపకులు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రియమైన శిష్యులను ఇంటికి పిలిపించి వారి తెలివితేటలకు మెరుగులు దిద్దేవారు.
అట్లా అడపాలవారు తామున్న ఇంటికి పిలిపించి తాము నేర్చుకున్న ఆటవెలది, తేటగీతి, కంద పద్యాల ఛందస్సులను ఆనాడే నాకు నేర్పినారు. భవిష్యత్తు కాలంలో పద్యకవిగా నిలబడడానికి ఆ విధంగా నాకు పునాది వేశారు.! ఇంట్లో భోజనాంతరం, నన్ను తమ పుస్తకాలున్న అల్మారా దగ్గరకు తీసుకొని వెళ్లారు. వారి అల్మారాలో అప్పటి వరకు నేను రచించిన 36 పుస్తకాలను చూడగలిగాను.
నా ఆశ్చర్యానికి అంతులేదు. ‘నా పుస్తకాలు మీ అల్మారాలోకి ఎలా వచ్చాయి? అని అడిగాను. ‘నేను నిన్ను మరచిపోలేదు. మీ క్లాస్‌మేట్ భాస్కరరెడ్డి ద్వారా మీరు రాసిన పుస్తకాలనన్నింటినీ సంపాదించాను’, అంతేకాదు మీ పుస్తకాలను చదివి, మీ మీద ఒక పుస్తకం కూడా రచించాను అని అప్పటికి అచ్చుకాని వ్రాతప్రతిని నాకందించారు. అది చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి. వెంటనే వారి పాదాలను స్పృశించాను.
ఇంతకు నామీద వారు రాసిన పుస్తకం పేరు ‘ఆర్షకవి’ ఆచార్య మసన చెన్నప్ప అడపాల వారందులో సుమారు 36 గ్రంథాలు పరిచయం చేశారు. ఇట్లే ఇటీవలనే ‘ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే’ అనే చిన్న పుస్తకాన్ని నా సాహిత్య జీవితాన్ని అనుశీలిస్తూ రచించారు. నామీద వారికి ఇంత ప్రేమ కలగడానికి కారణం, వారు పాఠశాల స్ధాయిలో ఛందస్సు నేర్పితే నేను విశ్వవిద్యాలయస్థాయిలో అనేక పద్యకృతులు రచించడమే, ఉపనిషత్పరిశోధకునిగా ఉండడమే.
అడపాల వారి శ్రీమతి భారతి. ఆ దంపతులిద్దరికీ నేను సొంత కుమారునితో సమానం. ఎప్పుడూ ఇంటికి వెళ్లినా వారు నన్ను భోంచేయకుండా విడిచిపెట్టరు. అడపాల వారికి ముగ్గురూ అమ్మాయిలే! అందరూ విద్యాధికులే. వారిలో వాణి అనే అమ్మాయి విద్యారంగానికి సంబంధించి పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీ సంపాదించారు. అడపాల దంపతుల మీద గల గౌరవానికి గుర్తుగా నేను 2021లో ‘కోకిల’ అనే పద్య కావ్యాన్ని అంకితం చేశాను. వారు కృతిని స్వీకరిస్తూ చెప్పిన పద్యాలు అమృతాయమానమైనవి.
‘మధుర భాషణమున మసన చెన్నప్పకు
మంచి పేరు గలదు; మరియు హాస్య
చతురుడగునుచును పనిషద్రహాస్యాలను
తేట తెలుగులోన తెలియబరుచు.
కాలమేదియైన కమ్మని గొంతుతో
కోకిలమ్మ మేలుకొల్పునటుల
చెన్నపార్యుడును వచించెడి పలుకులు
మంచిమార్గమందు మనల నిలుపు’
‘జయహో హనుమ’ నాకు అంకితం
అడపాల వారికి నా మీద శిష్యాను రక్తి. నాకు వారి మీద గురుభక్తి. ఎక్కడైనా శిష్యులు తమ కృతులను గురువులకంకితం చేస్తారు. నేను ‘కోకిల’ ద్వారా అదే పని చేశాను. కానీ వారు నా మీదున్న ప్రేమతో 200 కంద పద్యాల్లో రచించిన ‘జయహో హనుమ!’ అనే పద్యకృతిని నాకంకితం చేశారు.
ఆ కృతిలో చిన్నదైనా అడపాల వారి పద్య రచనా వైదుష్యాన్ని తెలియజేస్తుంది. శ్రీ అడపాలవారిని చూసినప్పుడు, మనం ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ దేశానికి వెళ్లినా మన మాతృభాషను మరువరాదనే సందేశం అందుతుంది.
ఒక సామాన్య శాస్త్రోపాధ్యాయునిగానూ, విద్యాధికారిగానూ, సుమారు నలభై ఏళ్లు విద్యారంగంలో ఉన్న అడపాలవారు ఇప్పటిదాకా పది పద్య కృతులను రచించారు. తెలుగు భాష ఎంత గొప్పదో, తెలుగు పద్యం ఎంత గొప్పదో చెప్పడానికి అడపాల వారిని ఉదాహరణగా చూపవచ్చు.
‘భగవంతుడు మనసిచ్చెను
భగవంతుడు వాక్కునిచ్చె బాగుగమనకే;
భగవంతుడై నడిపించును
భగవంతుడై మూలమన్ని పనులకు హనుమా’! అని ఒక పద్యంలో వారే చెప్పినట్లు ఆ భగవంతుడే నాకు అడపాల నరసింహారెడ్డి గారిని బాల్యంలో గురువుగా అందించాడని భావిస్తున్నాను.
వ్యాసకర్త సెల్: 9885654381