14-07-2025 02:12:19 AM
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయమని, కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిందేనని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేయడం కూడా చట్ట వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు.
చట్ట పరిధిలో అందరూ పనిచేసుకోవాలని సూచించారు. క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి, గన్‌మెన్ కాల్పులు జరిపిన అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ జరుగుతుందని తెలిపారు. బీసీ బిల్లు, రిజర్వేషన్ల పెంపు అన్ని కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమేనని ఆయన పునరుద్ఘాటించారు. బీసీ రిజర్వేష్ల అంశంలో ఇతరులు లబ్ధి పొందాలని చూడటం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.