calender_icon.png 26 September, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాంగ్‌చుక్‌కు షాక్

26-09-2025 01:25:04 AM

  1. తన ఎన్జీవో ఫారిన్ ఫండింగ్ లైసెన్స్ రద్దు 
  2. లేహ్ అల్లర్లకు వాంగ్‌చుక్ వ్యాఖ్యలే కారణం
  3. హోం మంత్రిత్వ శాఖ ఆరోపణలు అవాస్తవం: సోనమ్ వాంగ్‌చుక్

లేహ్, సెప్టెంబర్ 25: లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసిన ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ స్వచ్ఛంద సంస్థ ‘ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్ (ఎస్‌ఈసీఎమ్‌వోఎల్)’ ఫారిన్ ఫండింగ్ లైసెన్స్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం రద్దు చేసింది.

రాష్ట్ర హోదా కోసం లేహ్‌లో హింసాత్మక ఆందోళనలు జరిగిన కొద్ది గంటల్లోనే హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ అల్లర్లకు సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని పేర్కొన్న హోం మంత్రిత్వ శాఖ ఆయన స్వచ్ఛంద సంస్థ ఫారిన్ ఫండింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

వాంగ్ చుక్ సంస్థ పలుసార్లు విదేశీ రుణాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందని మంత్రిత్వ శాఖ ఆరోపించింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం బుధవారం జరిగిన అల్లర్లలో నలుగురు చనిపోగా.. 40 మంది వరకు పోలీసులతో సహా దాదాపు 80 మంది గాయపడ్డారు.  

ఇది తెలివైన నిర్ణయం కాదు

పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పీఎస్‌ఏ) కింద అరెస్టుకైనా సిద్ధమే అని వాంగ్ చుక్ ప్రకటించారు. ‘ఒకసారి అల్లర్లకు నేను కారణం అంటారు. మరోసారి కాంగ్రెస్ కారణం అంటారు. అసలు సమస్యను పరిష్కరించకుండా తనను బలిపశువుని చేశారు’ అని వాంగ్ చుక్ పేర్కొన్నారు.