calender_icon.png 25 November, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మంత్రివర్గ సమావేశం.. జీహెచ్ఎంసీ విస్తరణకు ఆమోదం

25-11-2025 05:18:10 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు 4 గంటలకుపైగా జరిగిన కేబినెట్ సమావేశం కీలక అంశాలపై చర్చించింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ విస్తరణకు ఆమోదించామని, పెద్ద అంబర్ పేట్, జల్ పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దుమ్మాయిగూడ, పోచారం, ఘట్ కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్ పూర్, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, మీర్ పేట, బోడుప్పల్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, జవహార్ నగర్ మున్సిపాల్టీలను జీహెచ్ఎంసీలో విలీనానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 

అలాగే మరో డిస్కమ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. కొత్త డిస్కమ్ పరిధిలోకి వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సంస్థ వచ్చే పదేళ్లలో విద్యుత్ డిమాండ్ కు అవసరమైన ఏర్పాట్లపై చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 3 వేల మోగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఆమోదించిన కేబినెట్ సోలార్ విద్యుత్ కొనుగోలుకు త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. 2 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలుకు మంత్రివర్గం పంప్డ్ స్టోరేజ్ విభాగంలో పెట్టుబడులు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది.

10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ యూనిట్లకు కొత్త పరిశ్రమలు సొంతంగా విద్యుత్ తయారీ చేసుకునేందుకు కేబినెట్ అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాలని, పాల్వంచ, మక్తల్ లోనూ ప్లాంట్ల నిర్మాణ అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్ లో భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ను 3 సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది.

భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థతో పాటే టీఫైబర్ కేబుల్లనూ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా స్కూల్ కు 20 ఎకరాల స్థలం, ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్ కు 40 ఎకరాలు కేటాయింపునకు రాష్ట్ర మంత్రివర్గం అనుమతించింది. రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ ల ఏర్పాటుకు నిర్ణయించామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.