13-07-2025 12:21:21 AM
- మా సహకారం లేకుంటే బిల్ పాస్ అయ్యేదే కాదు
-తెలంగాణ సాధనలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): తెలంగాణ ఏ ఒక్కరి వల్లనో రాలేదని, సకల జనులంతా పోరాడి కలిసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. తెలంగాణ సాధనలో న్యాయవాదల పాత్ర ఎంతో విలువైనదని పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో బీజేపీ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు రోజు తనతో పాటు పలువురు న్యాయవాదులు బీజేపీ లోక్‌సభ పక్షనేత అరుణ్ జైట్లీ, రాజ్యసభ పక్ష నేత సుష్మాస్వరాజ్‌ను, బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్‌ను కలిసి బిల్లును పాస్ చేయించేలా కోరామన్నారు. రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన న్యాయవాదులను, విద్యార్థులు, రైతులు, సహా అన్ని వర్గాలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దారుణంగా మోసం చేశాయన్నారు.
న్యాయ వాదులంతా ఐక్యంగా ముందుకు వచ్చి ఈ సర్కారును కూలగొట్టాలని పిలుపునిచ్చారు. ధర్మయుద్ధం చేసి ఈ ప్రభుత్వాన్ని దింపుతామని హెచ్చరించారు. బంగారు తెలంగా ణగా, వికసిత్ తెలంగాణగా మార్చేది ఒక్క బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. న్యాయవాదులంతా కలిసి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. న్యాయవాదుల న్యాయమైన డి మాండ్లు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గోకుల్ రామారావు పాల్గొన్నారు.